Climate Change | మునిచ్, ఆగస్టు 4: వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతం అయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు హెచ్చరించారు. 2050 తర్వాత వచ్చే 6 వేల ఏండ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవ్వొచ్చని వారు వెల్లడించారు. వచ్చే పదిహేనేండ్లలో అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్(ఏఎంఓసీ) వ్యవస్థ పతనమవుతుందని, ఈ పరిణామం జీవావరణ వ్యవస్థ, మానవ సమాజాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, పాట్స్డమ్ వాతావరణ ప్రభావ పరిశోధన సంస్థ పరిశోధకుల బృందం తెలిపింది.
దక్షిణార్థ గోళంలోని ఉపరితల వెచ్చని నీటిని ఈ వ్యవస్థ ఉత్తర అట్లాంటిక్లోని శీతల ప్రాంతాలకు పంపుతుంది. ఉప్పగా, చల్లగా ఉండే ఈ నీరు సముద్ర అడుగు భాగంలో కదులుతూ దక్షిణానికి ప్రవహిస్తుంది. ఇది దక్షిణార్థ గోళం విపరీతంగా వేడెక్కకుండా, ఉత్తరార్థ గోళం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. జీవ శక్తిని ఇచ్చే పోషకాలను సముద్ర పర్యావరణ వ్యవస్థ అంతటా వ్యాపింపచేస్తుంది. అయితే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం పెరగడం, మంచు కరగడం వల్ల ఈ వ్యవస్థ బలహీనమైపోతున్నది. పరిశోధకుడు మయా బెన్-యామి మాట్లాడుతూ ‘మా పరిశోధన మనకు ఒక మేల్కొలుపు, హెచ్చరిక. ఇప్పటికీ కొన్ని అంశాలను మనం నిరోధించలేం. ప్రశ్నార్థకంగా ఉన్న వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మనం మరింత డాటాను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు.