Trump Tariffs | న్యూయార్క్, ఏప్రిల్ 5: ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించడం, మరికొన్ని దేశాలు సైతం అదే తరహా వైఖరిని వ్యక్తం చేస్తున్న క్రమంలో అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం 60 శాతం ఉందని ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ హెచ్చరించింది. ఇదే కనుక జరిగితే అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రపంచమంతటా తీవ్రంగా పడుతుంది.
ట్రంప్ నిర్ణయంతో ఇప్పటికే కొన్ని దేశాలు కుదేలయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల విధింపు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం 60 శాతానికి చేరుకుందని, అంతకు ముందు ఇది 40 శాతమే ఉందని జేపీ మోర్గాన్ విశ్లేషించింది. విధ్వంసకర అమెరికా విధానాలు ఈ ఏడాదంతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పెట్టే అవకాశాలు ఉన్నట్టు గుర్తించామని పేర్కొంది. ఆ దేశ వాణిజ్య విధానం తక్కువ వ్యాపార అనుకూలంగా ఉందని గురువారం వెల్లడించింది.
బ్యాంకులు, పెట్టుబడి, ఇతర ఆర్థిక వ్యవహారాల గురించి విశ్లేషించే ఎస్ అండ్ పీ గ్లోబల్ సంస్థ కూడా అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశం 30 నుంచి 35 శాతం ఉందని పేర్కొంది. మార్చి నాటికి ఇది 25 శాతం ఉందని తెలిపింది. ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించక ముందు గోల్డ్‌మన్ శాచ్స్ కూడా అమెరికాలో ఆర్థిక మాంద్య ప్రమాదం గతంలో 20 శాతం ఉండగా, అది ఇప్పుడు 35 శాతానికి పెరిగిందని ప్రకటించింది. ఈ ఆర్థిక మాంద్యం వాస్తవ రూపం ఇప్పటికే ఈక్విటీ మార్కెట్లో ప్రతిబింబించిందని హెచ్ఎస్బీసీ తెలిపింది. ప్రముఖ ఆర్థిక, బ్రోకరేజ్, బ్యాంకింగ్ సంస్థలైన బార్క్లేస్, బోఫా గ్లోబల్ రీసెర్చ్, డ్యూయిష్ బ్యాంక్, ఆర్బీసీ కేపిటల్ మార్కెట్స్, యూబీఎస్ గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్లు సైతం ఈ ఏడాది అమెరికా రెసిషన్ ముప్పును ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి.
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌ల సెగ భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తగులుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా క్లయింట్లు ఖర్చులను తగ్గించుకుంటారని చెప్తున్నారు. ఐటీ సేవలపై ట్రంప్ ప్రత్యక్షంగా టారిఫ్‌లను విధించలేదు. అయినప్పటికీ, అమెరికాలోని మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, రిటెయిల్ రంగాలకు చెందిన క్లయింట్లు కొత్త సుంకాలకు తగినట్లుగా తమ బడ్జెట్లను సర్దుబాటు చేసుకుంటారు. భారతీయ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్ అమెరికన్ కంపెనీలే కాబట్టి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు.
ట్రంప్ టారిఫ్‌లను ప్రకటించిన వెంటనే భారతీయ ఐటీ రంగం రేటింగ్స్‌ను బెర్న్‌స్టీన్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తగ్గించాయి. అనేక సంవత్సరాల నుంచి ఆదాయ వృద్ధి బలహీనంగా ఉన్న నేపథ్యంలో క్లయింట్ కాన్ఫిడెన్స్‌ను ట్రంప్ పునరుద్ధరిస్తారని ఐటీ రంగం ఆశలు పెట్టుకుంది. అటువంటి సమయంలో టారిఫ్‌ల పిడుగులు కురిశాయి. భారత దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల విలువ 190 బిలియన్ డాలర్లు. దీనిలో సగానికిపైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో వ్యాపార సంస్థలకు తమ వ్యయాలపై విశ్వాసం సన్నగిల్లితే, ఆ మార్పుల ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలపై కచ్చితంగా పడుతుంది. ఆర్థిక మాంద్య ప్రమాదమున్న క్రమంలో అనవసరమైన వాటిపై ఖర్చు చేసే కంపెనీలు ఇబ్బందులు పడక తప్పదని బీఎన్పీ పారిబాస్ విశ్లేషకుడు కుమార్ రాకేశ్ చెప్పారు.
ఆర్థికం మాంద్యం అంచనాలు వస్తున్నా ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడానికి వెనుకాడేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాతో వ్యాపారం చేసే భాగస్వాములపై ట్యారిఫ్ల విధింపు నిర్ణయంలో మార్పు లేదని తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నవారిని ఉద్దేశించి ఇచ్చిన పోస్ట్‌లో, తన విధానాలు ఎన్నడూ మారబోవని తెలిపారు. సంపన్నులమవడానికి, మునుపెన్నడూ లేనంతగా సంపన్నులమవడానికి ఇది చాలా గొప్ప సమయమని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌ను పెట్టారు.
తయారీ రంగంలో అమెరికా కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి అమెరికాకు వస్తాయని ఫెడరల్ ప్రభుత్వానికి లక్షల కోట్ల డాలర్లు సమకూరుతాయని తెలిపారు. ఆర్థిక మాంద్యం అంచనాల నేపథ్యంలో అమెరికన్ బ్యాంకింగ్ రంగం షేర్స్ శుక్రవారం దాదాపు 6 శాతం పతనమయ్యాయి.అమెరికా ఫెడరల్ రిజర్వు సత్వరమే వడ్డీ రేట్లను తగ్గించాలని మదుపరులు ఆశిస్తున్నారు. అయితే ట్యారిఫ్ల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందని, ఆర్థిక అరాచకత్వం ప్రబలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివ స్పందిస్తూ వృద్ధి మందకొడిగా ఉన్న సమయంలో ప్రపంచ దేశాలకు తీవ్రమైన ముప్పు ఉన్నట్లు కనిపిస్తున్నదని తెలిపారు.
వాల్ స్ట్రీట్ శుక్రవారం ప్రారంభం అవడానికి కాస్త ముందు ట్రంప్ ఇచ్చిన పోస్ట్‌లో, అమెరికా నుంచి దిగుమతులపై కొత్తగా ప్రతీకార ట్యారిఫ్లను చైనా ప్రకటించిందన్నారు. దీనినిబట్టి చైనా భయాందోళనలకు గురైనట్లు స్పష్టమవుతున్నదని ఎద్దేవా చేశారు. ఇది భయాందోళనలకు గురి కాదగిన సమయం కాదని చెప్పారు.
ట్రంప్ వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు ప్రకటించడంతో నిత్యావసరాలు, పలు ఇతర వస్తువుల ధరలు కొండెక్కనున్నాయి. దీంతో ధరల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అమెరికా పౌరులు భారీ యెత్తున స్టోర్లు, మార్కెట్లపైకి ఎగబడుతున్నారు. ఇతర దేశాలు విధించిన టారిఫ్‌ల కారణంగా అమెరికాలో అనేక వస్తులవుల ధరలు మరింత పెరుగనున్నాయి. తైవాన్‌పై ట్రంప్ 32 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ధరలు పెరగనున్నాయి. ఇక ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలూ పెరగనున్నాయి. దీంతో పండ్ల దగ్గర నుంచి టూత్‌పేస్ట్ వరకు, సెల్‌ఫోన్ నుంచి ఇయర్ ఫోన్ వరకు, పలు వస్తువుల ధరలు పెరగకముందే కొనుగోలు చేసేందుకు అమెరికన్లు క్యూలు కడుతున్నారు.
ట్రంప్ టారిఫ్‌ల కారణంగా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల ధరలు ముందుగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రభావం ఉత్పత్తి రంగంలో అంతగా ఉండదు. ముఖ్యంగా వస్ర్తాలు, పాదరక్షలు, ఆటో విడి భాగాలు, ఔషధ రంగ ఉత్పత్తులు ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. వీటి ధరలు పెరిగినా అమ్మకాలు యధావిధిగానే కొనసాగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిపుణులు పౌరులకు పలు సూచనలు చేస్తున్నారు. ధరలు చూసి బెంబేలెత్తిపోవద్దని, అవసరమైన దానికన్నా ఎక్కువ సరుకును కొనుగోలు చేయవద్దని, వాటిని నిల్వ చేయవద్దని సూచిస్తున్నారు. కాగా, అమెరికా అన్ని విదేశీ దిగుమతులపై 10 శాతం పన్నులు విధించగా, శనివారం నుంచి అవి అమలులోకి వస్తాయని ప్రకటించింది. అధిక డ్యూటీలు విధించిన పన్నులు మాత్రం ఏప్రిల్ 9 నుంచి అమలవుతాయి.