లండన్, నవంబర్ 23: కొవిడ్ సోకడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలే కాదు.. మొదటిసారిగా కొవిడ్ ఇన్ఫెక్షన్తో ఒక ప్రయోజనం ఉందని చెప్తున్నారు ఇంగ్లండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడం.. క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుందని వీరు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్’లో ప్రచురితమయ్యాయి.
ఈ పరిశోధన ప్రకారం.. శరీరంలో మైనోసైట్లు అనే రకమైన తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్ల నుంచి శరీరానికి రక్షణ కల్పించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, క్యాన్సర్ బాధితుల్లో మాత్రం కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు ఈ మోనోసైట్లను హైజాక్ చేసి క్యాన్సర్ అనుకూల కణాలుగా మార్చేస్తాయి. దీంతో ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థ నుంచి క్యాన్సర్‌కు రక్షణ కల్పించేలా మారిపోతాయి.
తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శరీరంలో ప్రత్యేక రకమైన మోనోసైట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి క్యాన్సర్ వ్యతిరేక గుణాలను తిరిగి పొందుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.