Israel | జెరూసలేం, అక్టోబర్ 1: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్-హమాస్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. పలు భవనాలు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇజ్రాయల్ హెచ్చరికలు జారీ చేసింది. వేలాది మందిని బాంబు షెల్టర్లకు తరలించింది. దాడులను అడ్డుకోవడానికి తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. లెబనాన్‌లో హెజ్బొల్లా నేతల మరణాలకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు దిగింది.
ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కూడా ఎక్స్‌లో నిర్ధారించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితులపై చర్చించింది. ఏడాది కాలంలో సెక్యూరిటీ క్యాబినెట్ ఇలా సమావేశం కావడం ఇదే ప్రథమం. కాగా, దాడిని ఇరాన్ నిర్ధారించింది. ఇజ్రాయెల్‌పై డజన్లకొద్దీ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తే మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించింది.
🇮🇱🇮🇷 15 minutes Iranian missiles hitting Israel … supercut pic.twitter.com/OABH2cWfb4
— Lord Bebo (@MyLordBebo) October 1, 2024
ఇరాన్ తక్షణం క్షిపణి దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే దానిని నిజం చేస్తూ ఇరాన్ దాడికి దిగడం గమనార్హం. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అమెరికా చూస్తూ ఊరుకోదని ఉన్నతాధికారి ఒకరు హెచ్చరిక కూడా చేశారు. అయితే దీనిని ఇరాన్ బేఖాతరు చేస్తూ దాడికి దిగింది. దీనిపై ఇజ్రాయెల్ మిలటరీ స్పందిస్తూ ఇప్పటివరకు ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదని, అయితే ఈ దాడితో తాము అప్రమత్తమయ్యామని, తమ రక్షణ, దాడి వ్యవస్థలను దానికి అనుగుణంగా సిద్ధం చేసినట్టు మిలటరీ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో సైరన్ల ద్వారా పౌరులను అప్రమత్తం చేసినట్టు ఆయన చెప్పారు. అయితే దాడులతో ఏ ప్రాంతాలు దెబ్బతిన్నవి, మరణాల గురించి ఆయన వివరించ లేదు. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపింది. ఇరాన్ క్షిపణులను కూల్చేయాలని బైడెన్ అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. కాగా, ఇరాన్ దాడి నేపథ్యంలో భారతీయులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు రావద్దని ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ మన దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
టెల్ అవీవ్‌లోని జఫాలో ఉగ్ర దాడి జరింది. మంగళవారం సాయంత్రం జెరూసలేం వీధిలో కొందరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులిద్దరూ పోలీస్ కాల్పుల్లో మరణించారు. రైలులోంచి దిగిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పౌరులు చాలామంది నేలపై బోర్లా పడుకుని కాల్పుల నుంచి తప్పించుకోగా, నలుగురు మరణించారు. కొందరు గాయపడ్డారు.
లెబనాన్‌లో భూతల దాడులను ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఇప్పటివరకు వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. తాజాగా లెబనాన్ భూభాగంలోకి ప్రవేశించి దాడులు మొదలుపెట్టింది. అందులో భాగంగా లెబనాన్ సరిహద్దు సమీపంలో ఉన్న సుమారు రెండు డజన్ల గ్రామాల ప్రజలను తక్షణం ఇళ్లు వదిలి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలటరీ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తమ వాహనాలను ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ లిటానీ నదివైపు తరలించవద్దంటూ పౌరులకు ఎక్స్‌లో హెచ్చరికలు చేయగా, తమ భూభాగంలోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించినట్టు వచ్చిన వార్తలను హెజ్బొల్లా ఖండించింది. లెబనాన్‌లోకి ప్రవేశించే ఏ చర్యనైనా దీటుగా ఎదుర్కొంటామని హెజ్బొల్లా ప్రతినిధి మహమ్మద్ అఫిఫ్ పేర్కొన్నారు.
టెల్ అవీవ్‌కు సమీపంలోని గిల్లాట్ ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు హెజ్బొల్లా ప్రకటించింది. మిలటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200, టెల్ అవీవ్ శివారులోని మొస్సాద్ హెడ్ క్వార్టర్స్‌పై నాలుగు రాకెట్లను ప్రయోగించినట్టు తెలిపింది. అలాగే సెంట్రల్ ఇజ్రాయెల్‌పై మధ్యంతర క్షిపణులను ప్రయోగించామని, ఇది కేవలం ఆరంభం మాత్రమేని పేర్కొంది.
ఇజ్రాయెల్ రహస్య గూఢచార వ్యవస్థ మొస్సాద్ ఇరాన్ సీక్రెట్ సర్వీస్‌లోకి చొరబడిందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీనెజాద్ ఆరోపించారు. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మొస్సాద్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇరాన్ ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ చీఫ్ తమను మోసం చేసి మొస్సాద్‌కు ఏజెంట్‌గా మారిపోయాడని ఆరోపించారు. అతనితో పాటు మరో 20 మంది ఇజ్రాయెల్‌కు డబుల్ ఏజెంట్లుగా పనిచేశారన్నారు. వీరంతా ఇరాన్లో జరిగే అనేక రహస్య ఆపరేషన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్‌కు అందజేసేవారని, పలు డాక్యుమెంంట్లు అపహరించే వారని, అలా అపహరించిన వాటిలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీరి చర్య కారణంగానే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టుల మరణం సంభవించిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గతంలో ఇరాన్ అణు కార్యక్రమాల గురించి వెల్లడిస్తూ వాటి పత్రాల గురించి తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.