ఖాన్ యూనిస్(గాజా స్ట్రిప్), అక్టోబర్ 30: గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది. వేలాది మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న దవాఖానల సమీపంలో వైమానిక దాడులు జరుగుతుండటంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
యుద్ధం కారణంగా గాజాలో నిత్యావసరాల కొరత తీవ్రమైంది. ఆహార లభ్యత కష్టం కావడంతో ప్రజలు తమ పిల్లలకు బలవంతంగా ఉప్పు నీళ్లు తాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని యూనిసెఫ్ ప్రతినిధి టోబీ ఫ్రికర్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో ఇరు పక్షాలు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు.
ఆదివారం రష్యాలోని మకాచకలా విమానాశ్రయంలోకి దూసుకొచ్చిన కొందరు.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి వచ్చిన విమానంలో ఇజ్రాయెల్ ప్రయాణికుల కోసం గాలించారు. వారిలో కొందరు పాలస్తీనా జెండాలు పట్టుకొని ఉండగా.. కొందరు ‘పిల్లల హంతకులకు డంగెస్తాన్లో స్వాగతం లేదు’ అనే బ్యానర్లను ప్రదర్శించారు. ఇజ్రాయెల్ ప్రయాణికులపై వారు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 20కి మందికిపైగా గాయపడ్డారు.