న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి శాంతి దూతగా మారారు. మరో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేశారు!. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన పెద్దరికంతో విరమింపజేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. థాయ్లాండ్ (Thailand), కంబోడియా (Cambodia) మధ్య గత మూడు రోజులుగా జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు (Ceasefire) అంగీకరించాయని వెల్లడించారు. ప్రస్తుతం కంబోడియా పర్యటనలో ఉన్న ఆయన ఇరుద దేశాధినేతలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా ప్రకటించారు.
కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
థాయ్లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు శనివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య 32కి చేరుకోవడంతోపాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 1,30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఐక్య రాజ్య సమితికి చెందిన భద్రతా మండలి శుక్రవారం న్యూయార్క్లో రహస్యంగా అత్యవసర సమావేశం నిర్వహించి థాయ్-కంబోడియా తాజా ఘర్షణలపై చర్చలు జరిపింది. కాగా, ఘర్షణ పడుతున్న రెండు దేశాలతోపాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది.
మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని ప్రతిపాదించింది. ఘర్షణలను నిలిపివేసి సంయమనం పాటించాలని, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐరాస దౌత్యవేత్త ఒకరు కోరారు. తమపై ముందుగా కంబోడియా దాడి చేసినట్లు థాయ్లాండ్ చేస్తున్న ఆరోపణలపై సమితిలోని కంబోడియా రాయబారి చియా కేవ్ స్పందిస్తూ తమ కన్నా మూడు రెట్ల పెద్ద సైన్యం, వైశాల్యం ఉన్న దేశంపై వైమానిక దళమే లేని ఓ చిన్న దేశం ఎలా దాడి చేయగలదని ప్రశ్నించారు.