Terrorist attack : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆదివారం పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని హసన్ ఖేల్ ప్రాంతంలో బాంబు నిర్వీర్య యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ముందుగా బాంబు పేలుడుకు పాల్పడి, అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అదే జిల్లాలోని సీమాన్ ప్రాంతంలో భద్రతా పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరణించిన భద్రతా సిబ్బంది మృతదేహాలను, క్షతగాత్రులను బన్నూలోని జాయింట్ మిలిటరీ దవాఖానకు విమానంలో తరలించారు. దాడుల అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని సెర్చింగ్ చేస్తున్నాయి.
మే 8వ తేదీ రాత్రి ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని తహసీల్ షెవాలో ప్రైవేట్ బాలికల పాఠశాలను గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేసిన తర్వాత ఈ రెండు దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు తొలుత వాచ్‌మెన్‌ను చిత్రహింసలకు గురిచేసి, ఆ తర్వాత పాఠశాలలోని రెండు గదులను పేల్చివేశారన్నారు. గత ఏడాది మేలో మిరాలీలోని రెండు ప్రభుత్వ బాలికల పాఠశాలలను పేల్చివేసినప్పుడు కూడా ఇలాంటి దాడులే జరిగాయి.