న్యూయార్క్, అక్టోబర్ 11: అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్కడి పన్ను విధానం గందరగోళంగా మారుతున్నది. ముఖ్యంగా ఎఫ్-1 విద్యార్థి వీసా గడువు ముగిసి, హెచ్-1బీ వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పన్ను విధానంలో ఉన్న సంక్లిష్టత కారణంగా జరిమానాలు కట్టాల్సి వస్తున్నది. సాధారణంగా ఎఫ్-1 విద్యార్థి వీసా గడువు ఐదేండ్లు ఉంటుంది. ఈ ఐదేండ్లలో విద్యార్థులు నాన్ రెసిడెంట్ హోదాలో ఉంటారు. వీరు అమెరికాలో చేసే పార్ట్‌టైమ్ ఉద్యోగం ద్వారా సంపాదించే దానికే పన్ను చెల్లించాలి. భారత్‌లో ఏదైనా ఆదాయం పొందినా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అమెరికాలో స్థిరపడిన వారు మాత్రం రెసిడెంట్ హోదాలో ఉంటారు. వీరు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పొందే ఆదాయాన్ని సైతం అమెరికా ప్రభుత్వానికి చూపించి, దానికి వర్తించే పన్నును చెల్లించాల్సి ఉంటుంది. గత మూడేండ్ల కాలంలో 183 రోజులు అమెరికాలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
ఎఫ్-1 వీసా గడువు ముగిసే ముందు భారతీయ విద్యార్థులు అమెరికాలోనే స్థిరపడేందుకు హెచ్-1బి వర్క్ వీసాలకు దరఖాస్తు చేస్తారు. అయితే, ఈ దరఖాస్తు ఆధారంగా ఒక్కోసారి వీరిని రెసిడెంట్‌గా అమెరికా పన్ను అధికారులు పరిగణిస్తున్నారు. హెచ్-1బి లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఈ వీసా రాకపోతే కొందరు విద్యార్థులు మళ్లీ ఎఫ్-1 వీసా తీసుకుంటున్నారు. హెచ్-1బి కోసం దరఖాస్తు చేశారు కాబట్టి భారత్‌లో వీరు పొందే ఆదాయాన్ని కూడా అమెరికాలో చూపించి, పన్ను చెల్లించాల్సి వస్తున్నది. చెల్లించకపోతే జరిమానాలు కట్టాల్సి వస్తున్నది.