ఢాకా, డిసెంబర్ 25: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ)కి కాబోయే అధినేత తారీఖ్ రహ్మాన్ 17 ఏళ్ల స్వీయ అజ్ఞాతవాసాన్ని వీడి గురువారం ఢాకా చేరుకున్నారు. ఢాకా విమానాశ్రయం వద్ద ఆయనకు పార్టీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. భార్య, కుమార్తెతో కలసి ఢాకా చేరుకున్న తారీఖ్ రహమాన్ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య తన నివాసానికి కాన్వాయ్‌లో బయల్దేరారు. ఈ సందర్భంగా పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించేందుకు తన వద్ద ప్లాన్ ఉందని చెప్పారు. 2006 నుంచి 2008 మధ్య సైన్యం మద్దతుతో నడిచిన ప్రభుత్వ హయాంలో రహ్మాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలో ఆయనను చిత్రహింసలు పెట్టారు.
తీవ్ర గాయాలపాలైన రహ్మాన్ ప్రభుత్వ అనుమతితో 2008లో చికిత్స నిమిత్తం లండన్‌కు పయనమయ్యారు. బంగ్లాదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన బీఎన్పీకి యాక్టింగ్ చైర్మన్‌గా రహ్మాన్ వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రహ్మాన్ 17 ఏండ్ల అజ్ఞాతవాసం తర్వాత దేశానికి తిరిగి రావడం దేశ రాజకీయాలలో ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది దేశం నుంచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందిన నేపథ్యంలో మొదటిసారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. షేక్ హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనకుండా ఆపద్ధర్మ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎన్నికల బరిలో బీఎన్పీ ఏకైక ప్రధాన పక్షం కానున్నది. మెజారిటీ లభిస్తే రహ్మాన్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి.