కాబూల్, ఆగస్టు 24: ప్రభుత్వంలో మహిళలు భాగం కావొచ్చని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు.. అంతలోనే మాటమార్చారు. మహిళలపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇండ్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే వీధుల్లోకి రావాలని, భద్రతా చర్యలు మెరుగయ్యేంతవరకూ ఈ ఆదేశాలను పాటించాలన్నారు. ఈ మేరకు కాబూల్‌లో మంగళవారం తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడారు. ఈ నెల 31లోపు అమెరికా తరలింపు ప్రకియను పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో డెడ్‌లైన్‌ను పొడిగించేదిలేదని తెగేసి చెప్పారు. పంజ్‌షీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అఫ్గాన్ నిపుణుల తరలింపును అమెరికా చేపడుతున్నదని,దీన్ని నిలిపివేయాలన్నారు.
రక్షణ కవచంగా మహిళలు
పౌరులు, ఉద్యోగుల ఇండ్లల్లోకి చొరబడి సోదాలు చేస్తూ తాలిబన్లు మానవహక్కులను కాలరాస్తున్నారని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ ఆరోపించారు. తాలిబన్ల అకృత్యాలను ఎవరైనా ప్రతిఘటిస్తే, మహిళలు, పిల్లలను రక్షణ కవచంగా వాడుతున్నట్టు తెలిపారు. దీని కోసం ఇప్పటికే వందలాది మంది మహిళలు, పిల్లలను వాళ్లు అపహరించినట్టు చెప్పారు. తమను తాలిబన్లు కిడ్నాప్ చేస్తారేమోనన్న భయంతో వేలాది మంది మహిళలు, చిన్నారులు కొండలు, అడవుల్లోకి పారిపోయి తలదాచుకుంటున్నట్టు వెల్లడించారు. ఉత్తర బఘ్లాన్‌లోని అందరబ్ లోయకు ఆహార పదార్థాలను, ఇంధన రవాణాను తాలిబన్లు అడ్డుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీంతో లోయలో పరిస్థితులు క్షీణిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
విమానం హైజాక్‌పై అయోమయం
సంక్షుభిత అఫ్గానిస్థాన్ నుంచి తమ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు వచ్చిన ఉక్రెయిన్ విమానం ఒకటి హైజాక్‌కు గురైందని, దుండగులు ఆయుధాలతో వచ్చి ఈ విమానాన్ని కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇరాన్ తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ తెలిపారు. అనంతరం.. ఈ వార్తలను ఇరాన్, ఉక్రెయిన్ దేశాలు తోసిపుచ్చాయి.
ఆర్థికమంత్రిగా గుల్ అఘాను
అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆర్థికమంత్రిగా గుల్ అఘాను, కాబూల్ గవర్నర్‌గా ముల్లాహ్ షిరిన్‌ను నియమించారు. అలాగే హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాబూల్ మేయర్, ఇంటెలిజెన్స్ చీఫ్, ఉన్నత విద్య చీఫ్‌లను కూడా నియమించారు. మరోవైపు, అఫ్గాన్ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంగళవారం దాదాపు 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ సంభాషించారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్.. తాలిబన్ అగ్ర నాయకుడు అబ్దుల్ ఘనీ బరదార్‌తో సోమవారం కాబూల్‌లో రహస్య సమావేశం జరిపారు. అఫ్గాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణపై ఈ భేటీ జరిగినట్టు సమాచారం. అఫ్గాన్ శరణార్థులకు 20 వేల గృహాలను ఉచితంగా నిర్మించి ఇస్తామని అమెరికాకు చెందిన గృహనిర్మాణ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ ప్రకటించింది.