కాబూల్, ఆగస్టు 21: అఫ్గాన్ ప్రజలు, అక్కడ చిక్కుకుపోయిన విదేశీయులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా దేశం విడిచి వెళ్లిపోవడానికి కట్టుబట్టలతో, పిల్లాపాపలతో కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు ప్రవాహంలా వస్తున్నారు. తమ పౌరులను రప్పించే ప్రక్రియను మూడు రోజుల్లో ముగిస్తామని బ్రిటన్, అఫ్గాన్ పౌరులు కాబూల్ ఎయిర్ పోర్టుకు రావొద్దని అమెరికా ప్రకటించడంతో ఇక తాము తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుపోక తప్పదేమో అన్న భయంతో శనివారం అఫ్గాన్ ప్రజలు కాబూల్‌కు పోటెత్తారు. ఈ సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. పసి పిల్లలు కాళ్ల కింద నలిగి చనిపోయారు. ఆకలికి, దాహానికి తాళలేక హృదయ విదారకంగా విలపించారు. అనేక మందికి గాయాలయ్యాయి. శనివారం ఒక్కరోజే కాబూల్ ఎయిర్‌పోర్టు దగ్గర చిన్నారులు సహా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తున్నది. విదేశీయులతో కలిసి ఎయిర్‌పోర్టుకు వస్తున్న అఫ్గాన్ పౌరులను గుర్తించి వెనక్కు పంపేందుకు తాలిబన్లు రహదారుల వెంబడి చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కాబూల్ నుంచి రోజుకు రెండు విమానాల ద్వారా తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు భారత్‌కు అమెరికా, నాటో దళాలు అనుమతించాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు ప్రస్తుతం వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. శనివారం స్వదేశానికి వెళ్లేందుకు కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు వస్తున్న 150 మంది భారతీయులను తాలిబన్లు అడ్డుకొని వేరే ప్రాంతానికి తరలించారు. అఫ్గాన్ మీడియాలో ప్రసారమైన ఈ కథనం ఇండియాలో కలకలం సృష్టించింది. అయితే, గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత తాలిబన్లు భారతీయులను వదిలివేశారు. ఇదిలా ఉండగా, శనివారం 80 మంది భారతీయులను కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి రప్పించారు. ఇంకా 400 మంది అక్కడ చిక్కుకుపోయినట్టు అంచనా.
కాబూల్ ఎయిర్‌పోర్టులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం ఎక్కకుండా 72 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులను తాలిబన్లు అడ్డుకొన్నారు. వారందరినీ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కు పంపించివేశారు. అఫ్గాన్‌లోని సిక్కులు, హిందువులను రప్పించడానికి చర్యలు తీసుకొంటామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమను అఫ్గాన్ నుంచి తీసుకెళ్లాని సిక్కులు, హిందువులు భారత్, కెనడాలను కోరుతున్నారు.
ఉగ్రవాదులను జైళ్ల నుంచి వదిలేస్తున్నారు
అఫ్గానిస్థాన్ జైళ్లలో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను తాలిబన్లు వదిలేస్తున్నారు. తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కు చెందిన 100 మందికిపైగా ఉగ్రవాదులను తాలిబన్లు జైళ్ల నుంచి విడుదల చేశారు. వీరిలో టీటీపీ మాజీ డిప్యూటీ చీఫ్ మాలువీ ఫకీర్ మహమ్మద్‌తో పాటు పలువురు సీనియర్ కమాండర్లు కూడా ఉన్నారు. విడుదల అనంతరం వీరంతా మళ్లీ ఉగ్ర సహచరులతో కలిసిపోయారు. అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రవాదులను కూడా తాలిబన్లు విడుదల చేస్తున్నారు. టీటీపీ అల్ ఖైదా మార్గదర్శనంలోనే పనిచేస్తుంది. తాలిబన్ల చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మా సిబ్బందికి ఆటంకం కలిగించొద్దు
కాబూల్ నుంచి విమానాల ద్వారా మనుషులను తరలించడం అతిపెద్ద, అత్యంత సంక్లిష్ట కార్యక్రమం అని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కాబూల్ విమానాశ్రయం వద్ద అమెరికాకు చెందిన 6వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని తాలిబన్లను హెచ్చరించారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో తమ బలగాలు పనిచేస్తున్నట్టు తెలిపారు. కాబూల్‌లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రక్రియ ఆలస్యం అవుతున్నదన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘అమెరికా పౌరుల భద్రతే మా ప్రధాన లక్ష్యం’ అన్నారు.
3 జిల్లాలు తాలిబన్ల నుంచి స్థానిక బలగాల చేతుల్లోకి..
కాబూల్, ఆగస్టు 21: అఫ్గానిస్థాన్‌లోని బఘ్లాన్ ప్రావిన్సులోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి తిరిగి స్థానిక బలగాలు శనివారం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు పక్షాలకు చెందినవారూ గాయపడ్డారు. దేవుడి దయ వల్ల మూడు జిల్లాలకు తాలిబన్ల నుంచి విముక్తి కల్పించామని పోలీసు మాజీ చీఫ్ బాను వ్యాఖ్యానించారు.
ఆఫ్‌లైన్‌లోకి తాలిబన్ వెబ్సైట్లు
తాలిబన్లకు చెందిన అధికారిక వెబ్సైట్లు శుక్రవారం నుంచి పనిచేయడం లేదు. అవన్నీ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయి. కారణం ఏమిటన్నది తెలియలేదు. ఈ వెబ్సైట్ల ద్వారానే తాలిబన్లు తమ ఆక్రమణ పర్వాన్ని ప్రపంచానికి తెలియజేశారు. వాట్సాప్ కూడా తాలిబన్ గ్రూపులను తొలగించింది. గతంలో ఫేస్బుక్కూడా తాలిబన్ గ్రూపులను డిలీట్ చేసింది. అయితే ట్విట్టర్ తాలిబన్ల ఖాతాలను తొలగించలేదు. తాలిబన్ గ్రూప్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్‌కు ట్విట్టర్లో 3లక్షల ఫాలోవర్లు ఉన్నారు.
అతివలపై అరాచకం
కాబూల్, ఆగస్టు 21: మేం ఇప్పుడు పూర్తిగా మారిపోయాం. మహిళలను గౌరవిస్తాం. వారికి అన్ని హక్కులు ఉంటాయి. విద్యను అందిస్తాం. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాం.. అని తాలిబన్లు ప్రకటించి వారం రోజులు కూడా కాలేదు. వారి మొట్టమొదటి ఫత్వా ఆడపిల్లల విద్యపైనే జారీ అయింది. హెరాత్ ప్రావిన్స్‌లో కో-ఎడ్యుకేషన్‌పై తాలిబన్లు నిషేధం విధించారు. ‘సమాజంలో అన్ని అరిష్టాలకు కో-ఎడ్యుకేషనే మూలం’ అని తాలిబన్ ప్రతినిధి, అఫ్గానిస్థాన్ ఉన్నత విద్యావిభాగం హెడ్ ముల్లా ఫరీద్ అన్నారు. వాటిని నివారించడానికి కో-ఎడ్యుకేషన్‌పై నిషేధం తప్ప మరో మార్గం లేదన్నారు. మహిళా లెక్చరర్లు కేవలం ఆడపిల్లలకే పాఠాలు బోధించాలని ఆదేశించారు. ఇంకోవైపు, అఫ్గాన్ యువతులు జీహాదీలను పెండ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నారు. మహిళలను శవపేటికల్లో బంధించి చుట్టుపక్కల దేశాలకు సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు. అఫ్గాన్‌లోని పర్వాన్ ప్రావిన్స్ మాజీ జడ్జి నజ్లా అయూబీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆహారం రుచిగా వండలేదన్న కారణంతో ఓ మహిళకు తాలిబన్లు నిప్పంటించారని ఆమె తెలిపారు. నజ్లా అయూబీ పర్వాన్ ప్రావిన్స్‌కు మొదటి మహిళా జడ్జి. 2001లో తాలిబన్లు అధికారం కోల్పోయాక, ప్రజాస్వామిక అఫ్గానిస్థాన్‌లో రాజ్యాంగ నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆకలి కేకలు
అఫ్గానిస్థాన్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు (1.4 కోట్లు) తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగామ్ వెల్లడించింది. ఆహారాన్ని అందజేయడానికి తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. కానీ ఒక ప్రావిన్షియల్ రాజధాని మినహా మిగతా చోట్ల ఆహారాన్ని పంచలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. 20 లక్షల మంది పిల్లలు ఆహార కొరతతో బాధపడుతున్నారని పేర్కొన్నది.