ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లతో పాకిస్థాన్ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఆ సంబంధాలతో ఇండియాను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ ఎజెండా అనీ చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు సాక్షాత్తూ ఆ దేశ అధికార పార్టీ నేతే తమ సీక్రెట్ ఎజెండాను బయటపెట్టారు. అధికార పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ నేత నీలమ్ ఇర్షాద్ షేక్ మాట్లాడుతూ.. కశ్మీర్‌పై పోరాటంలో పాకిస్థాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించినట్లు చెప్పారు.
తాలిబన్లు మాతోనే ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు కశ్మీర్ విషయంలో సాయం చేస్తామనీ చెప్పారు అని ఇర్షాద్ షేక్ అన్నారు. టీవీ చానెల్లో ఆమె ఈ మాట చెప్పడంతో న్యూస్ యాంకర్ వెంటనే అందుకొని.. మేడమ్, మీరు ఏం చెప్పారో మీకు తెలుసా? మీకు దాని పరిణామాలు తెలియడం లేదు. ఈ షో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ అవుతుంది. ఇండియాలోనూ అవుతుంది అని యాంకర్ అన్నారు. అయినా ఇర్షాద్ షేక్ ఏమాత్రం సందేహించకుండా.. తాలిబన్లను సరిగా పట్టించుకోలేదు. అందుకే వాళ్లు మనకు సాయం చేస్తారు అని చెప్పడం గమనార్హం. అయితే అంతకుముందే కశ్మీర్ ఇండియా అంతర్గత విషయమని, ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు చెప్పారు.
#PTI leader Neelam Irshad Sheikh: Taliban have announced that they will join hands with Pakistan to liberate Kashmir. pic.twitter.com/MfC7mQ6lLh
— SAMRI (@SAMRIReports) August 23, 2021