కాఠ్మాండు : నేపాల్‌లో జనరేషన్ జెడ్ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యమ్యాన్ని ఉసిగొల్పుతున్న ఆ జెన్ జెడ్ గ్రూపుకు చెందిన నేతలు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ను ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి(Sushila Karki) పేరును ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమెకు పగ్గాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న జనరేషన్ జెడ్ తాజాగా ఈ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా బ్యాన్‌ను వ్యతిరేకిస్తూ జెన్ జెడ్ భారీ ఉద్యమాన్ని చేపట్టింది. జెన్ జెడ్‌లో 13 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న యువత పాల్గొన్నది. అయితే తాము చేపట్టిన ఉద్యమాన్ని కొందరు అవకాశవాదులు తప్పుదారి పట్టించినట్లు జెన్ జెడ్ ఆరోపిస్తున్నది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు మరీ అదుపు తప్పాయి. రాష్ట్రపతి కార్యాలయాన్ని, పార్లమెంట్ బిల్డింగ్‌ను, సుప్రీంకోర్టు బిల్డింగ్‌ను నిరసనకారులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నేపాల్ ఆర్మీ దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నది. బుధవారం రోజున నిరసనకారులతో చర్చలు నిర్వహించారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరిగాయి. ఆన్లైన్ వర్చువల్ మీటింగ్‌లో సుమారు నాలుగువేల మంది పాల్గొన్నారు. ఆ సమయంలో కర్కి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆర్మీతో పాటు తాత్కాలిక ప్రభుత్వాధికారులతో సుశీలా చర్చల్లో పాల్గొనాలని జెన్ జెడ్ అభిప్రాయపడింది.