వాషింగ్టన్, ఏప్రిల్ 23 : ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టింది మొదలు అక్కడి ప్రవాస భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. 40 శాతం మంది భారతీయ అమెరికన్లు ఆ దేశాన్ని వీడాలని భావిస్తున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. అమెరికాలో భారత సంతతి ప్రజలు 52 లక్షల మంది నివసిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వీళ్లందరిలో ‘అమెరికా డ్రీమ్’ కనుమరుగు అవుతున్నదని సర్వే అభిప్రాయపడింది. ఈ మార్పునకు ప్రధాన కారణం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణమే. ‘కార్నెగీ ఎండోమెంట్’ తాజా సర్వేలో భాగంగా.. 1,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలు విశ్లేషించగా, అమెరికాను వీడాలని తరచూ ఆలోచిస్తున్నామని 14 శాతం మంది, అప్పుడప్పుడు ఆలోచించామని 26 శాతం మంది చెప్పారు. ప్రతి పది మందిలో ఆరుగురు (58 శాతం) అమెరికా రాజకీయాలతో విసిగిపోయామని చెప్పగా, 41 శాతం మంది వ్యక్తిగత భద్రతపై ఆందోళనతో ఉన్నట్టు సర్వే పేర్కొన్నది.
అమెరికా నగరాల్లో జీవన వ్యయం భరించలేనిదిగా మారిపోయింది. శాన్ఫ్రాన్సిస్కో, సియాటిల్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఒక బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌కు నెల అద్దె 3,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఉంటున్నది. ప్రధాన పట్టణ, టెక్ హబ్‌లలో కుటుంబ వ్యయం మధ్య తరగతికి చాలా భారంగా మారింది. మరోవైపు ద్రవ్యోల్బణం, ఉద్యోగ భద్రత ఆందోళన కలిగిస్తున్నది. భారత సంతతి పౌరుల్లో 71 శాతం మందికి ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న అమెరికా ఆర్థిక, వలస విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు ఎంతమాత్రమూ నచ్చటం లేదు. ‘అమెరికా అమెరికన్ల కోసమే’ అన్న రాజకీయ విధానం, నినాదాన్ని నొక్కి చెప్పే ప్రసంగాలు భారతీయ అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికాకు చెందిన వారిమనే భావన వారిలో తగ్గించిందని విశ్లేషకులు చెబుతున్నారు.