Solar Activity | పెర్త్: సోలార్ యాక్టివిటీ అధికమవుతున్నదని, ఫలితంగా దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పెరుగుతున్నదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి కర్టిన్ యూనివర్సిటీ నుంచి బినార్ స్పేస్ ప్రోగ్రామ్లో భాగంగా పంపిన బైనార్ 2, 3, 4 అనే మూడు చిన్న ఉపగ్రహాలు(క్యూబ్శాట్స్) గత వారం దిగువ భూకక్ష్యలో కాలిపోయాయి. ఇవి మూడు నెలలు పని చేసిన తర్వాత కాలిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేయగా, రెండు నెలలకే దగ్ధమయ్యాయి. సోలార్ యాక్టివిటీ పెరగడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
భూమిపైకి సూర్యుడి నుంచి ప్రవహించే కణాలు(చార్జ్డ్ పార్టికల్స్) పెరగడాన్ని సోలార్ యాక్టివిటీ పెరిగిందని పేర్కొంటారు. ఈ చార్జ్డ్ పార్టికల్స్ ఉపగ్రహాల ఎలక్ట్రికల్ భాగాలను కాల్చేస్తాయి. ఇప్పుడు అధికంగా ఉన్న సోలార్ యాక్టివిటీ 2026 కల్లా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.