Suicide bomb | భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)లో తాజాగా ఆత్మాహుతి దాడి (Suicide bomb) జరిగింది. ఓ పాఠశాల బస్సును సూసైడ్ బాంబ్ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Army Public School)కు చెందిన బస్సు ఈ ఉదయం పిల్లల్ని తీసుకొని వెళ్తోంది. ఆ సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది. సూసైడ్ బాంబ్‌తో వచ్చిన కారు బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటన బలోచిస్థాన్ (Balochistan)లోని కుజ్దార్ (Khuzdar) ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 38 మంది గాయపడినట్లు కుజ్దార్ జిల్లా సీనియర్ అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ పిల్లల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ దాడిని పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసీన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఇక ఇప్పటివరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు.
Also Read..
Indian origin techie | అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య.. బస్సులో కత్తితో దాడి చేసి
Amir Hamza | ప్రాణాపాయ స్థితిలో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు