Pakistan : పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆటో రిక్షా ద్వారా జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 8 మంది మరణించగా, 35 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం, ఖైబర్ పక్తుంఖ్వా పరిధిలోని లక్కి మార్వాట్ జిల్లాలో మంగళవారం ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ప్రాంతంలో మిలిటరీ కదలికలు ఎక్కువగా ఉన్నప్పటికీ దాడి జరగడం విశేషం.
అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు పేలుడు పదార్థాలు కలిగిన ఆటో రిక్షా ఒకటి నౌరంగ్ బజార్ ప్రాంతంలోని ఫట్టాక్ చౌక్ ప్రాంతంలోకి దూసుకొచ్చి, పేలిపోయింది. ఆటోలోని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, 35 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉంది. ఘటన గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని స్థానిక సరాయ్ నౌరంగ్ పరిధిలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించారు.
బాధితుల చికిత్స కోసం అధికారులు స్థానిక ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీనిలో భాగంగా వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, వెంటనే ఆస్పత్రికి రప్పించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక చెక్‌పోస్ట్‌పై జరిగిన దాడిలో దాదాపు 15 మంది పోలీసులు మరణించారు.