HPH-15 | టోక్యో, డిసెంబర్ 18: మధుమేహాన్ని నియంత్రించే కొత్త ఔషధాన్ని జపాన్‌లోని కుమమొటొ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హెచ్‌పీహెచ్-15 అనే ఈ ఔషధం ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపు చేయడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సైతం సమర్థంగా పని చేస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మెట్ఫార్మిన్ కంటే ఇది మెరుగ్గా పని చేస్తున్నట్టు చెప్పారు. ప్రొఫెసర్ ఐచి అరకి, అసోసియేట్ ప్రొఫెసర్ హిరోషి తతీషి నేతృత్వంలోని పరిశోధకుల బృందం హెచ్‌పీహెచ్-15ను అభివృద్ధి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ‘డయాబెటొలోజియా’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కాలేయం, కండరాలు, కొవ్వు కణాలు గ్లూకోజ్‌ను శోషించుకోవడాన్ని మెరుగుపర్చడం ద్వారా ఇది షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్కువ డోసుతోనే ఇది మెట్ఫార్మిన్ కంటే మెరుగ్గా పని చేస్తున్నట్టు తేల్చారు.
చర్మం కింద పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలోనూ, ఫ్యాటీ లివర్‌ను నయం చేయడంలోనూ హెచ్‌పీహెచ్-15 సమర్థంగా పని చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో యాంటీఫైబ్రాటిక్ గుణాలు కూడా ఉన్నాయని, మధుమేహ బాధితుల్లో సాధారణంగా కనిపించే లివర్ ఫైబ్రోసిస్‌ను తగ్గించడానికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. మెట్ఫార్మిన్ తీసుకునే వారిలో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువవడం సమస్యగా ఉంటుందని, హెచ్‌పీహెచ్-15తో ఈ సమస్య చాలా తక్కువ అని తెలిపారు. మధుమేహంతో పాటు ఊబకాయం ఉన్న వారి చికిత్సకు ఈ ఔషధం మెరుగ్గా పని చేస్తుందని చెప్పారు.