అమెరికా అధ్యక్షుడు ‘హెచ్చరికల ఆట ఆడుతున్నాడు’. రష్యా కూడా ఒక బలీయమైన శక్తి అన్న సంగతిని ఆయన గుర్తుంచుకోవాలి. ప్రతి హెచ్చరిక ఒక బెదిరింపే, యుద్ధం వైపు వేసే అడుగే. ఈ యుద్ధం రష్యా, ఉక్రెయిన్ మధ్య కాదు, ఆయన సొంత దేశంతోనే. ‘ఆయన (ట్రంప్) తనకిష్టమైన ది వాకింగ్ డెడ్ (మృతులు లేచి నడిచే) సినిమాలను మళ్లీ చూడాలి, అలాగే ఒకప్పటి మా ‘డెడ్ హ్యాండ్ (మృత హస్తం)’ను గుర్తుంచుకోవాలి.
– రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్
రష్యా, అమెరికా కలిసి ఎటువంటి వ్యాపారం చేయడం లేదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని ఆ విఫల రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్‌కు చెప్పండి, ఆయన ఇంకా అధ్యక్షుడిననే అనుకుంటున్నట్టున్నాడు. ఆయన ఓ ప్రమాదకరమైన ప్రాంతంలోకి వస్తున్నాడు. అవి కేవలం మూర్ఖపు, రెచ్చగొట్టే ప్రకటనలే అని నేను భావించడం లేదు. అవి అనూహ్య పరిణామాలకు దారితీయొచ్చు. అందుకే రష్యాకు సమీపంలో మోహరించేందుకు రెండు అణు జలాంతర్గాములను పంపాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాను.
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Russia – America | న్యూయార్క్, ఆగస్టు 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల యుద్ధం ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతున్నది. తన దారికి రాని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. రష్యా నుంచి చమురు, రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడమే కాకుండా.. భారత్, రష్యాలవి ‘డెడ్ ఎకానమీ (మృత ఆర్థిక వ్యవస్థ)’లని వ్యాఖ్యానించారు. దీంతో రష్యా, అమెరికాల మధ్య మొదలైన వాగ్యుద్ధం.. చిలికిచిలికి గాలివానగా మారినట్టు అణుయుద్ధ పరిస్థితులకు దారి తీస్తున్నది. తమ వద్దనున్న ‘డెడ్ హ్యాండ్ (అణ్వాయుధ సామర్థ్యం)’ను గుర్తు పెట్టుకోవాలని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ హెచ్చరించగా.. ట్రంప్ ఏకంగా రెండు అణు జలాంతర్గాములను రష్యాకు సమీపంలో మోహరించాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా ఆసియా, ఐరోపా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మెద్వెదెవ్ ను విఫల రష్యా అధ్యక్షుడు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ వాగ్యుద్ధం మొదలైంది. అంతకుముందు ట్రంప్.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా కాల్పుల విరమణ పాటించాలంటూ విధించిన డెడ్‌లైన్‌ను 50 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించారు. లేదంటే రష్యాపై సరికొత్త ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన మెద్వదేవ్.. అమెరికా అధ్యక్షుడు ‘హెచ్చరికల ఆట ఆడుతున్నాడు’ అని వ్యాఖ్యానించారు. రష్యా కూడా ఒక బలీయమైన శక్తి అన్న సంగతిని ఆయన గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ప్రతి హెచ్చరిక ఒక బెదిరింపే, యుద్ధం వైపు వేసే అడుగే అని అన్నారు. ఈ యుద్ధం రష్యా, ఉక్రెయిన్ మధ్య కాదు, ఆయన సొంత దేశంతోనే’ అని ఎక్స్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. మెద్వెదెవ్ ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు.
భారత్, రష్యా మధ్య కొనసాగుతున్న వాణిజ్యంపై ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతూ ఈ రెండు దేశాలవి మృత ఆర్థిక వ్యవస్థలని వ్యాఖ్యానించారు. ‘రష్యా, అమెరికా కలిసి ఎటువంటి వ్యాపారం చేయడం లేదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని ఆ విఫల మాజీ రష్యా అధ్యక్షుడు మెద్వెదెవ్కు చెప్పండి, ఆయన ఇంకా అధ్యక్షుడిననే అనుకుంటున్నట్టు ఉన్నాడు. ఆయన ఓ ప్రమాదకరమైన ప్రాంతంలోకి వస్తున్నాడు’ అని పేర్కొన్నారు. దీనికి మెద్వెదెవ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘రష్యా మాజీ అధ్యక్షుడు చేసిన చిన్న వ్యాఖ్యలు ఎంతో బలవంతమైన అమెరికాను అంత ఆందోళనకరంగా స్పందించేలా రెచ్చగొట్టాయంటే రష్యా పూర్తిగా సరైన దిశలో ఉన్నట్టే’ అని పేర్కొన్నారు. తాము ఇదే మార్గంలో ముందుకు సాగుతామని చెప్పారు.
ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీస్, డేంజరస్ టెరిటరీ (ప్రమాదకర ప్రాంతం) వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆయన (ట్రంప్) తనకిష్టమైన ‘ది వాకింగ్ డెడ్’ (మృతులు లేచి నడిచే) సినిమాలను మళ్లీ వీక్షించాలి, అలాగే ఒకప్పటి ‘డెడ్ హ్యాండ్ (మృత హస్తం)’ను గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. మెద్వెదెవ్ బెదిరింపులకు స్పందనగా రష్యా సమీపంలోకి రెండు అణు జలాంతర్గాములను పంపించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ‘అవి కేవలం మూర్ఖపు, రెచ్చగొట్టే ప్రకటనలే అని నేను భావించడం లేదు. అవి నిజమయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే రష్యాకు సమీపంలో మోహరించేందుకు రెండు అణు జలాంతర్గాములను పంపాలని ఆదేశించాను’ అని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న రష్యా ‘డెడ్ హ్యాండ్’ పేరిట అణు వ్యూహాన్ని రూపొందించింది. ఎవరైనా రష్యా మీద దాడి చేస్తే, తక్షణమే ప్రతీకార చర్యగా దాడి చేసిన దేశంపై అణు దాడి జరిగేలా ఈ వ్యూహాన్ని రూపొందించారు. ప్రత్యర్థి దాడి చేసినప్పుడు రష్యా నాయకత్వం అప్రమత్తంగా లేకపోయినా, తక్షణం స్పందించకపోయినా డెడ్ హ్యాండ్ వ్యవస్థ తనకు తానే అణుదాడికి పాల్పడుతుంది.