Deportation | వాషింగ్టన్, జనవరి 26: తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తుండటంతో పలు వర్గాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తాము అనుకున్నట్టే అయ్యిందని, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు తిప్పలు తప్పవన్న తమ భయాలు నిజమయ్యాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపించడంతో ఎక్కడ తమపై ఆ వేటు పడుతుందేమోనని పలువురు విద్యార్థులు సైతం భయంతో వణుకుతున్నారు. భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్నారు.
పార్ట్‌టైం ఉద్యోగాలకు సంబంధించి ఆ దేశంలో కఠిన నిబంధనలు ఉన్నా ఇంతవరకు అవి సరిగ్గా అమలు కాలేదు. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక వాటిని కఠినంగా అమలు చేస్తుండటంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తాము దొరికితే ఎక్కడ డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) చేస్తారోనన్న భయంతో అమెరికాలోని పలువురు భారతీయులు వాటిని చేయడం మానేస్తున్నారు. ఉద్యోగం వద్దు బాబోయ్.. ఇక్కడ ఉండనిస్తే చాలు అన్న ధోరణి వారిలో కన్పిస్తున్నది. నిబంధనల ప్రకారం తగిన పత్రాలు లేనివారు, నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు, గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిలోనే ఈ భయం ఎక్కువగా ఉంటున్నది.
‘మా తల్లిదండ్రులు అప్పు ఉన్నత విద్య కోసం ఇక్కడకు పంపారు. వారిపై మరింత ఆర్థిక భారం మోపకుండా మేము చదువయ్యాక సాయంత్రాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం’ అని భారత్‌కు చెందిన ఒక విద్యార్థి తెలిపారు. ‘పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా ఇక్కడ మనుగడ చాలా కష్టం.’ అని మరో విద్యార్థి వాపోయాడు. ‘నా కాలేజీ అయిపోయిన తర్వాత చిన్న కేఫ్‌లో గంటకు ఏడు డాలర్లు (సుమారు రూ.603) సంపాదిస్తున్నా. ఇలా రోజుకు ఆరు గంటలు పనిచేస్తున్నా. దీంతో అవి నా ఖర్చులకు సరిపోతున్నాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు’ అని తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘మా అమ్మనాన్నలు రూ.42 లక్షలు అప్పు చేసి ఇక్కడకు పంపారు. ఇక్కడి అధికారులేమో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తే డిపోర్టేషన్ చేస్తామని అంటున్నారు. అందుకే దానిని మానేశా’ అని అక్కడ మాస్టర్స్ చేస్తున్న విద్యార్థి వివరించారు.
‘ఇప్పటికే అధికారులు పలు సంస్థల్లో యథేచ్ఛగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భయమేసి నేను,
నా స్నేహితులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేసాం. రిస్క్ తీసుకుని మా స్టూడెంట్ వీసాలను కోల్పోలేం’ అని న్యూయార్క్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యూపీకి చెందిన విద్యార్థి తెలిపాడు. ప్రస్తుతం 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. అదే సమయంలో ఆ అగ్ర దేశంలో 20,407 మంది సరైన పత్రాలే లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 2,467 మంది ఇప్పటికే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) శాఖ నిర్బంధంలో ఉన్నారు.
అమెరికాలో చదువుతున్న చాలామంది విద్యార్థులు ఎఫ్-1 వీసాపై ఉన్నారు. దీని ప్రకారం వారు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఆయా క్యాంపస్‌లోనే వారు వాటిని చేయాల్సి ఉంటుంది. దానిని అతిక్రమించితే అమెరికా దౌత్య విధానం ప్రకారం వారిని దేశం నుంచి బయటకు పంపేయవచ్చు. అయితే క్యాంపస్‌ల్లోనే అందరికీ ఉద్యోగాలు లభించవు కాబట్టి అక్కడి విద్యార్థులు రెస్టారెంట్లు, పెట్రోల్ పంప్‌లు, రిటైల్ స్టోర్‌ల్లో అనధికారికంగా పని చేస్తుంటారు. ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం దేశంలోని వందలాది మంది అక్రమ వలసదారులను మిలిటరీ విమానాల ద్వారా ఆయా దేశాలకు పంపించారు. ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.
జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వలసదారులు, శరణార్థులు, ఎఫ్-1 వీసాదారుల పట్ల ఉదారంగా ఉండేవారు. నిబంధనలకు విరుద్ధంగా బయట పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకున్నా పట్టించుకునే వారు కాదు. ట్రంప్ రాకతో నిబంధనలు ఎంత కఠినమయ్యాయంటే.. అమెరికాలో ఉంటున్న తమ కుమారుడి వద్ద ఐదు నెలలు ఉండేందుకు టూరిస్ట్ వీసాపై భారత్‌కు చెందిన తల్లిదండ్రులు న్యూయార్క్‌కు చేరుకున్నారు. అయితే వారి వద్ద రిటర్న్ టికెట్ లేదన్న సాకుతో వారిని దేశంలోకి రానీయకుండా తిరిగి భారత్‌కు పంపేసారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన బోర్డర్(సరిహద్దు) ఎమర్జెన్సీ వల్ల అక్రమ వలసలు తగ్గుముఖం పట్టాయి. సరిహద్దు గస్తీ సిబ్బంది ఒక్కొక్క వలసదారుడిని గంటల తరబడి గమనిస్తున్నారు. శాన్ డియాగో, ఎల్ పాసోలలో 1,500 మంది సైనికులను మోహరించారు. 2023 డిసెంబరులో అమెరికాలోకి 2.5 లక్షల మంది అక్రమంగా వలస వచ్చారు. ఈ సంఖ్య గత డిసెంబరులో దాదాపు 47 వేలకు తగ్గిపోయింది.