Mojtaba Khamenei : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణపై ఇరాన్ సుప్రీం నేత (Iran Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. ఈ దశలో హర్మూజ్‌పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనను ఇరాన్ మీడియా (Iran Media) చదివి వినిపించింది.
అమెరికా- ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌లో పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. ఈ క్రమంలో జలసంధిని కొత్త దశకు తీసుకెళ్తామని మొజ్తాబా ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. ఇక ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని సుప్రీంనేత స్పష్టంచేశారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో తమ హక్కులను వదులుకోమని వ్యాఖ్యానించారు. దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేకమంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు.
యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని ఖమేనీ చెప్పారు. ఈ దాడుల్లో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తామని అన్నారు. హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. జలసంధి మీదుగా వెళ్లే ట్యాంకర్లపై ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు వెలువడుతున్న వార్తల గురించి ప్రస్తావించారు. వారు అలా చేసి ఉండకూడదని, ఒకవేళ చేస్తే వెంటనే ఆపేయాలని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. ఇరాన్ సహకరించినా, సహకరించకపోయినా జలసంధి మీదుగా చమురు రవాణా త్వరగా ప్రారంభమవుతుందని మరో పోస్టులో తెలిపారు.