SpaceX | న్యూయార్క్: సౌర వ్యవస్థను దాటి వెళ్లగలిగే సామర్థ్యంతో ఒక అధునాతన పునర్వినియోగ వ్యోమనౌకను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్నది. ‘స్టార్‌షిప్’ పేరుతో రూపొందుతున్న ఈ వ్యోమనౌక 100 టన్నులకు పైగా బరువును మోసుకెళ్లగలదు. వేడి ఉష్ణోగ్రతలను తట్టుకునేలా దీనిని తయారుచేస్తున్నారు. సుదీర్ఘ అంతరిక్ష ప్రయోగాల కోసం ఇందులో అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలతో పాటు సమీప నక్షత్ర వ్యవస్థల్లోకి సైతం ప్రయాణించే సామర్థ్యం స్టార్‌షిప్‌కు ఉండాలనేది మస్క్ ఆలోచన. సంప్రదాయ రాకెట్లలో పునర్వినియోగ సామర్థ్యం అరుదుగా ఉంటుంది. స్టార్‌షిప్‌లో ఈ సామర్థ్య ఏర్పాటుపై స్పేస్ఎక్స్ సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది. తద్వారా అంతరిక్ష ప్రయాణ ఖర్చును గణనీయంగా తగ్గించాలని, సులభతరం చేయాలని ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే స్టార్‌షిప్ ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయి. ఇవి విఫలమవడంతో స్పేస్ఎక్స్ సంస్థ స్టార్‌షిప్‌కు మార్పుచేర్పులు చేస్తున్నది.
భూమిపై ఏదైనా విపత్తు సంభవించి మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లితే ఇతర గ్రహాలకు మనుషులను తీసుకెళ్లేలా స్టార్‌షిప్ ఉండాలనేది మస్క్ ఆలోచన. ఇందులో భాగంగా మొదట అంగారకుడి పైకి రెండేండ్లలో స్టార్‌షిప్‌ను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనుషులతో నాలుగేండ్లలో మార్స్ పైకి స్టార్‌షిప్ చేరుకుంటుందని ఆదివారం ఎలాన్ మస్క్ ప్రకటించారు.