Satellite to Cell | న్యూయార్క్ : దట్టమైన అడవైనా, మారుమూల ప్రాంతమైనా.. భీకర తుఫానులోనైనా, పెను విపత్తులోనైనా… ఎక్కడైనా, ఎలాంటి అత్యవసర స్థితిలోనైనా సెల్‌ఫోన్‌కు సిగ్నల్ అందే రోజులు రానున్నాయా? భూమిపైన ఉండే సెల్ టవర్లతో సంబంధం లేకుండా నేరుగా ఆకాశం నుంచి అరచేతిలోని సెల్‌ఫోన్‌కు సిగ్నల్ అందనుందా? అంటే అవుననే అంటున్నది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ. సమాచార సాంకేతికలతో సరికొత్త విప్లవంగా భావిస్తున్న ‘శాటిలైట్-టు-సెల్‌ఫోన్’ సాంకేతికతను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. దీనిని ‘డైరెక్ట్-టు-సెల్’ అని కూడా పిలుస్తున్నారు. జనవరి 27 నుంచి టెక్నాలజీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎలాన్ మస్క్ శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. బీటా పరీక్షలు విజయవంతమైతే ఈ సాంకేతికత త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న సాంకేతికత ప్రకారం మొబైల్ టవర్ల ద్వారా సెల్ఫోన్లకు సిగ్నల్ అందుతుంది. టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు. ఏవైనా ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సిగ్నల్ వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇప్పుడు ‘శాటిలైట్-టు-సెల్‌ఫోన్’ సాంకేతికతలో మొబైల్ టవర్ల అవసరం ఉండదు. దిగువ భూకక్ష్యలో ఉండే ఉపగ్రహాల నుంచి నేరుగా సెల్ఫోన్లకు సిగ్నల్ అందుతుంది. ఈ సిగ్నల్‌తో మెసేజ్‌లు, కాల్స్, డాటా సేవలు అందుతాయి. భూమిపైన ఏ మూలకైనా సిగ్నల్ వెళ్తుంది. ఎలాంటి విపత్తులు తలెత్తినా సిగ్నల్‌కు అంతరాయం ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో, విపత్తుల సమయాల్లో ప్రాణనష్టం తగ్గించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర సమాచార వ్యవస్థను ఉచితంగానే అందుబాటులోకి తీసుకొస్తామని స్టార్‌లింక్ సంస్థ చెబుతున్నది.