Jane Zhang @ Corona | చైనాను కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కుదిపేస్తున్నది. చైనాలోని దాదాపు 60 శాతం మందికి కొవిడ్ సోనికట్లు వార్తలు వస్తున్నాయి. దవాఖానల్లో బెడ్లు చాలకపోవడంతో నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కఠిన కరోనా మార్గదర్శకాలను అమలుచేస్తున్నారు. ఈ సమయంలోనే చైనాకు చెందిన ఓ పాపులర్ సింగర్ మాత్రం తాను కావాలనే కరోనా అంటించుకున్నా అని చెప్పి అందర్నీ నివ్వెరపరిచింది. కరోనా పాజిటివ్ స్నేహితులను ముట్టుకోవడం ద్వారా తనకు తానుగా కరోనా అంటించుకున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొన్నది.
చైనాకు చెందిన స్టార్ సింగర్ జేన్ జాంగ్ ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు వెల్లడించింది. చైనాలో కొత్త వేరియంట్ బీఎఫ్-7 ప్రబలంగా ఉన్న సమయంలో ఆమె ప్రకటన అన్ని దేశాల్లోని ఆమె అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. తాను కావాలనే తన స్నేహితుల ద్వారా కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ నెల 31 న కన్సర్ట్ ఉండటంతో కరోనా వ్యాప్తి చెందితే కార్యక్రమం నిలిచిపోతుందని తొలుత భయపడిందంట. దాంతో ముందుగానే తాను కరోనా అంటించుకుంటే న్యూ ఇయర్ కన్సర్ట్ లోపు తగ్గిపోతుందని, ఆ రోజున మళ్లీ రాదని ఇలా చేసినట్లు జేన్ జాంగ్ చైనా సోషల్ మీడియా పాట్ఫాం వీబోలో తెలిపింది.
కరోనా సోకిన స్నేహితుల ఇళ్లకు వెళ్లిన జేన్ జాంగ్.. వారితో ముచ్చట్లు పెడుతూ కౌగిలించుకుంటూ ఆడిపాడుతూ గడిపింది. ఒక రోజు తర్వాత గొంతులో నొప్పి, జ్వరం వచ్చింది. ఆమెకు పరీక్షలు జరపగా కరోనాకు పాజిటివ్‌గా తేలింది. ఉద్దేశపూర్వకంగా కరోనాకు గురైనట్లు జేన్ జాంగ్ ప్రకటించగానే.. ఆమెకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అభిమానులు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో జాంగ్ తన పోస్ట్‌ను తొలగించింది. అలాగే మరో పోస్ట్ చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పారు.