Goatabaya Rajapaksa | శ్రీలంక అధ్యక్షుడు గోటబయ్యా రాజపక్స సారధ్యంలోని శ్రీలంక పొదుజన పెరుమున (ఎస్ఎల్పీపీ) ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయింది. గోటబయ్యా సారధ్యంలోని అధికార కూటమికి చెందిన 42 మంది ఎంపీలు తాము స్వతంత్ర కూటమిగా పార్లమెంట్‌కు హాజరవుతామని మంగళవారం ప్రకటించారు. ఈ 42 మందిలో 14 మంది శ్రీలంక ఫ్రీడం పార్టీ, మరో పది మంది మిత్రపక్షాల సభ్యులు, 12 మంది ఎస్ఎల్పీపీ సభ్యులు ఉన్నారు. 2020 సాధారణ ఎన్నికల్లో ఎస్ఎల్పీపీ సారధ్యంలోని కూటమి 225 మంది సభ్యులు గల పార్లమెంట్లో 146 స్థానాలను గెలుచుకున్నది.
విదేశీ మారక ద్రవ్యం నిల్వలు నిండుకోవడంతో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. నిత్యావసర వస్తువుల కొరతతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అధికార కూటమిలో విభేదాలు చోటు చేసుకోవడం గమనార్హం. సోమవారం రాత్రి రాజపక్స తాను రాజీనామా చేయబోనని, పార్లమెంట్లో 113 మంది సభ్యులు గల పార్టీకి ప్రభుత్వాన్ని అప్పగిస్తానని ప్రకటించారు.
దారుణ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశాధ్యక్షుడు, ప్రభుత్వం రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజల నిరసనలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో సోమవారం అంతా రాజపక్స వరుస రాజకీయ సమావేశాలు నిర్వహించారు. మహిందా రాజపక్స ప్రభుత్వంలో ఆయన సోదరుడు, రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా గోటబయ్యా రాజపక్స.. 26 ఏండ్ల తమిళ టైగర్స్ తిరుగుబాటుకు చరమగీతం పాడటంలో కీలక పాత్ర పోషించారు.
2019లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో గోటబయ్యా రాజపక్ష మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించారు. ఇటీవలి కాలంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ప్రత్యేకించి అమెరికా డాలర్ల నిల్వలు తగ్గిపోవడంతో దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఫలితంగా తీవ్రమైన ఇంధన కొరత, ఎల్పీజీ గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో రాజపక్స ప్రభుత్వం తక్షణం వైదొలగాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు.