కొలంబో : శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. 1948లో స్వాతంత్ర్యానంతరం శ్రీలంక కనివినీ ఎరుగని ఆర్ధిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభ సెగలతో కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. కూరగాయల ధరలు రెట్టింపు కాగా ఏడాది కిందట బియ్యం ధర కిలో రూ 145 కాగా ఇప్పుడది రూ 220కి ఎగబాకింది.
క్యారెట్ కిలో ఏకంగా రూ 490 పలుకుతోంది. ఇంధన ధరల పెరుగుదలతో శ్రీలంకలో ద్రవ్యోల్బణం ఎగబాకింది. ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు, కరెన్సీ స్ధిరీకరణకు శ్రీలంక కేంద్ర బ్యాంక్ ఏప్రిల్లో వడ్డీరేట్లను పెంచినా ఆశించిన ఫలితాలు చేకూరలేదు. ఇంధనం, ఎరువులు, ఆహరం, మందుల దిగుమతులకు అవసరమైన విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత కూడా లంక పరిస్ధితిని మరింత దిగజార్చుతోంది. కరోనా మహమ్మారితో టూరిజం ఆధారిత ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కావడం లంక సంక్షోభానికి దారితీసింది.
విదేశాల్లో పనిచేసే లంకేయులు పంపే నిధులు తగ్గిపోవడం, ప్రభుత్వ రుణాలు పేరుకుపోవడం పరిస్ధితి మరింత దిగజారింది. ఇక ఇంధన ధరల పెంపు, రసాయన ఎరువుల దిగుమతిపై నిషేధంతో వ్యవసాయ రంగం కుదేలైంది. ద్రవ్యోల్బణం కనివినీ ఎరుగని స్ధాయిలో ఎగబాకడంతో 70 శాతం మంది లంకేయులు ఇప్పుడు ఆహార వినిమయాన్ని తగ్గించారని యూనిసెఫ్ పేర్కొంది.