Power Outage | మాడ్రిడ్, ఏప్రిల్ 28 : ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో అంధకారం అలుముకుంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజా రవాణా స్తంభించి భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. విమానాల రాకపోకలకు తీవ్ర జాప్యం ఏర్పడింది. రైలు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. దవాఖానల్లో సర్జరీలు ఆగిపోయాయి. మెట్రో రైళ్లలో ప్రయాణికులు చిక్కుబడిపోగా, నిలిచిపోయిన లిఫ్టులలోనుంచి బయటపడలేక చాలామంది అందులోనే ఉండిపోయారు. పవర్ గ్రిడ్‌ను పునరుద్ధరించేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో స్పానిష్, పోర్చుగీస్ ప్రభుత్వాలు అత్యవసర క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాయి. స్పెయిన్‌కు ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న ఫ్రాన్స్‌లోని కొంత భాగం కూడా తాత్కాలికంగా విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఫ్రాన్స్‌లో కొంతభాగంతోపాటు పోర్చుగల్ వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా స్తంభించినట్లు ఆ దేశ విద్యుత్తు సరఫరా సంస్థ ఆర్ఈఎన్ ధ్రువీకరించింది. ఐరోపాలో గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వెనుక సైబర్‌దాడి ఉండే అవకాశం లేకపోలేదని స్పెయిన్, పోర్చుగల్‌లోని పవర్ గ్రిడ్ అపరేటర్లు వెల్లడించాయి. స్పెయిన్, పోర్చుగల్‌లోని ప్రధాన నగరాలను కలిపే యూరప్‌లోని పవర్ గ్రిడ్‌పై సైబర్ దాడి జరిగి ఉండవచ్చని స్పానిష్ అధికారులు చెప్పారు. అయితే దీన్ని నిర్ధారించడానికి తమ వద్ద ఆధారాలు లేవని వారు తెలిపారు. ఈ తీవ్ర విద్యుత్తు సమస్యకు కారణాలు ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదని, సైబర్ దాడి జరిగి ఉండవచ్చన్న వాదనను కూడా తోసిపారేయలేమని వారు చెప్పారు.
విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్తు కంపెనీలతో పనిచేస్తున్నట్లు స్పానిష్ గ్రిడ్ ఆపరేటర్ రెడ్ ఎలెక్ట్రికా ప్రకటించింది. మాడ్రిడ్ అండర్‌గ్రౌండ్ వ్యవస్థను ఖాళీ చేయిస్తున్నట్లు స్పానిష్ రేడియో స్టేషన్లు తెలిపాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో మాడ్రిడ్ సిటీ సెంటర్ వద్ద భారీగాట్రాఫిక్ జామ్ అయినట్లు కేడర్ సెర్ రేడియో స్టేషన్ తెలిపింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడానికి కారణాలు ఏమిటో అధికారులు వివరించలేకపోతున్నారు. సైబర్ దాడి జరిగే అవకాశాన్ని కూడా వారు తోసివేయడం లేదు. మాడ్రిడ్ వీధులలో వందలాది మంది ఉద్యోగులు తమ ఆఫీసు భవనాల బయట నిలబడ్డారు.
ముఖ్యమైన భవనాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మాడ్రిడ్‌లోని నాలుగు ఆకాశ హర్మ్యాలలో ఒకదాన్ని ఖాళీ చేయించినట్లు సాక్షులు తెలిపారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన మెట్రో కార్లు, ఎలివేటర్లలో వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు స్థానిక రేడియో తెలిపింది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు నిలిచిపోయినట్లు పోర్చుగీస్ పోలీసులు తెలిపారు. లిస్బన్, పోర్టోలో మెట్రోను మూసివేసినట్లు వారు చెప్పారు. రైళ్లు కూడా నిలిచిపోయినట్లు తెలిపారు. రైళ్లలోనే ప్రయాణికులు చిక్కుకుపోవడంతో సబ్వే స్తంభించిపోయినట్లు లిస్బన్‌కు చెందిన సబ్వే ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ మెట్రోపాలిటనో డేలిబ్బోవా తెలిపింది. బ్యాకప్ జనరేటర్లతో లిస్బన్ విమానాశ్రయం పనిచేస్తున్నట్లు పోర్చుగల్ టాప్ ఎయిర్ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలలో తీవ్ర జాప్యం ఏర్పడినట్లు స్పెయిన్‌లో 46 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఏఈఎన్ఏ వెల్లడించింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. అత్యవసర సర్వీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం ప్రజలకు ఫోన్, నెట్ సౌకర్యం లేకుండాపోయింది. విద్యుత్తు లేకపోవడంతో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయని లిస్బన్లో నివసించే ఓ 23 ఏళ్ల అనువాద విద్యార్థిని తెలిపింది. ఏం జరుగుతోందో, ఎందుకు విద్యుత్తు నిలిచిపోయిందో తమకు ఏమీ తెలియడం లేదని ఆమె చెప్పింది. ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో బీభత్సంగా ఉన్నాయని, పరిస్థితి భయానకంగా ఉందని ఆమె తెలిపింది.
పోర్చుగల్‌లోని దవాఖానల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. విద్యుత్తు లేకపోవడంతో మిసెరికోర్డియా దవాఖానలో ముందు జాగ్రత్తగా ఆపరేషన్లను రద్దు చేశారు. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్లను రద్దు చేసినట్లు పోర్చుగల్‌లోని 24 దవాఖానలను నిర్వహించే యూనియన్ ఆఫ్ పోర్చుగీస్ మిసెరికోర్డియాస్(యూఎంపీ) తెలిపింది. పోర్చుగల్, స్పెయిన్‌లోని అనేక మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. సోల్ మెట్రో స్టేషన్తోసహా అనేక చోట్ల ఎలివేటర్లలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అత్యవసర సర్వీసుల సిబ్బంది శ్రమిస్తున్నారు.