మాడ్రిడ్, మార్చి 30: ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టి పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్న అమెరికాకు నాటో సభ్య దేశం స్పెయిన్ గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా యుద్ద విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేగాక ఇరు దేశాలకు చెందిన సైనిక స్థావరాలను కూడా ఇరాన్‌పై దా డుల కోసం యూఎస్ వాడుకోరాదంటూ నిర్ణయం తీసుకుంది.
తద్వారా ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధంలో అమెరికాకు మద్దతుగా నిలబడలేమని తేల్చి చెప్పింది. స్పెయిన్ రక్షణమంత్రి మార్గరిటా రాబెల్స్ ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడుతూ పై విషయాన్ని వెల్లడించారు. ‘ఇరాన్ యుద్ధానికి సంబంధించి చర్యల కోసం సంయుక్త సైనిక స్థావరాలు, గగనతలాన్ని ఉపయోగించడానికి మేం అనుమతించం’ అని చెప్పారు.
స్పెయిన్ నిర్ణయంతో అమెరికా యుద్ధ విమానాలు ‘ఎమర్జెన్సీ’ సమయంలో తప్ప మిగతా పరిస్థితుల్లో ఆ దేశ గగనతలం నుంచి వెళ్లలేవు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పెయిన్ గత కొద్ది రోజులుగా వాదిస్తున్నది.