గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 14, 2020 , 20:35:55

మందుబాబులకు ‘షాక్‌’!

మందుబాబులకు ‘షాక్‌’!

లండన్‌: ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ.. డ్రింకర్లకు నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. ఇక మందుబాబుల సంగతేంటి? అందుకే ఓ బార్‌ ఓనర్‌ వినూత్నంగా ఆలోచించాడు. దుకాణం ముందు ఎలక్ట్రిక్‌ కంచె ఏర్పాటు చేశాడు. దానిపై హెచ్చరిక కూడా రాసిపెట్టాడు. ఇంకేముంది షాక్‌ కొడ్తదనే భయంతో మందుబాబులు క్రమశిక్షణగా దూరం దూరం ఉంటూ మద్యం కొనుగోలు చేస్తున్నారట. 

నైరుతి ఇంగ్లండ్‌లోని సెయింట్ జస్ట్ గ్రామంలోగల స్టార్ ఇన్ బార్‌ యజమానికి ఈ కొత్త ఆలోచన వచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో మూతపడ్డ బార్లు, పబ్బులను జూలై 4న తెరిచారు. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, మందుబాబులు బార్‌లో గడిపే సమయాన్ని తగ్గించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, మద్యంప్రియులకు ఇవన్నీ చెప్తే పాటిస్తారా? అందుకే విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసినట్లు సదరు బార్‌ ఓనర్‌ జానీ మెక్‌ఫాడెన్‌ పేర్కొన్నాడు. తాను బార్‌ ముందు ఓ తాడు ఏర్పాటు చేస్తే ఎవరూ భయపడరని, తాడు దాటి లోనికి వస్తారన్నాడు. అందుకే ఎలక్ట్రిక్‌ కంచె ఏర్పాటు చేసి, దానిపైన హెచ్చరిక కూడా రాయించానని చెప్పాడు. దీంతో ప్రతిఒక్కరూ ఒకరినొకరు నెట్టుకోకుండా.. దూరంగా ఉంటూనే మద్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo