దుబాయ్: ‘ఎడారి ఓడ’ ఒంటె కన్నీళ్లకు పాము విషాన్ని హరించే శక్తి ఉన్నట్లు దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 26 రకాల పాము జాతుల విషాన్ని నిర్వీర్యం చేయగలిగే సత్తా ఒంటె కన్నీళ్లకు ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పేర్కొన్నది.
తాజా పరిశోధన ప్రకారం సహజమైన విష నిరోధకాలుగా పని చేసే యాంటీ బాడీస్ లేదా ప్రత్యేక బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఒంటె కన్నీళ్లలో ఉండి ఉండవచ్చునని పరిశోధకులు ప్రాథమికంగా గుర్తించారు. పాము విషంలోని న్యూరో టాక్సిన్స్, హెమో టాక్సిన్స్ వంటి వాటిని ఈ కాంపౌండ్స్ నిర్వీర్యం చేయగలవని గుర్తించామన్నారు. ఈ విషయం శాస్త్రీయంగా రుజువైతే, పాము కాటు బాధితులకు అందుబాటు ధరలో, సమర్థవంతమైన మందులను తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.