హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిద్ర సరిగా రావడం లేదని తరచూ స్లీపింగ్ మాత్రలు వేసుకుంటున్నారా? మెడికల్ షాపుల నుంచి మెలటోనిన్ మాత్రలు తీసుకుని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారా? అయితే మీకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్టే. దీర్ఘకాలంగా మెలటోనిన్ సప్లిమెంట్స్ (నిద్ర మాత్ర లు) వాడేవారికి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 90% మేరకు ఉన్నట్టు తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఇన్సోమ్నియా (నిద్రలేమి)తో బాధపడుతూ మెలటోనిన్‌ను వాడుతున్న 1.30 లక్షల మందిపై ఐదేండ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించామని, వీరిలో 90% మంది హార్ట్ ఫెయీల్యుర్కు గురయ్యే అవకాశం ఉన్నదని, వీరంతా ఏదో ఒక కారణంతో ఐదేండ్ల తర్వాత చనిపోయే అవకాశం రెండింతలు అధికంగా ఉన్నదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది.
ఇన్సోమ్నియాకు చికిత్స పొందుతూ ఏడాదిగా మెలటోనిన్ వాడుతున్న వారితోపాటు వాడనివారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో మెలటోనిన్ వాడుతున్న వారికి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 90% మేరకు ఉన్నదని, మెలటోనిన్ వాడనివారికి ఎటువంటి ముప్పు లేదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నది. దీర్ఘకాలం నుంచి మెలటోనిన్ వాడుతున్న వారిలో 19% మంది, ఈ సప్లిమెంట్ వాడనివారిలో కేవలం 6.6% మంది దవాఖాన పాలవుతున్నట్టు తెలిపింది. మెలటోనిన్ వాడుతున్నవారికి చికిత్స విధానాన్ని మార్చిన తర్వాత కూడా హార్ట్ ఫెయీల్యూర్ రిస్క్ అధికంగానే ఉన్నట్టు వెల్లడించింది. క్రమం తప్పకుండా నిద్రమాత్రలు వాడుతున్న వారిలో మరణాల రేటు 7.8 శాతంగా ఉన్నదని, వాడనివారిలో మరణాల రేటు 4.3 శాతం మాత్రమేనని వివరించింది.
మెలటోనిన్ అనేది మెదడు మధ్యలో ఉన్న పీనియల్ గ్రంధి ద్వారా రాత్రి సమయంలో విడుదలయ్యే హార్మోన్. మెలటోనిన్ ఉత్పత్తిని ఈ గ్రంధిని ప్రోత్సహిస్తుంది. కాంతి ఈ హార్మోన్ ఉత్పత్తిని, విడుదలను తగ్గిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే స్లీప్ సైకిల్ (నిద్ర వలయాన్ని) మెలటోనిన్ నియంత్రిస్తుంది. శరీర అవసరాలకు తగిన మొత్తంలో ఈ హార్మోన్ లేనప్పుడు మెలటోనిన్ సప్లిమెంట్స్, మెలటోనిన్ అధికంగా ఉండే ఆహారాలు ఆ లోటును భర్తీ చేసేందుకు దోహదపడతాయి. నిద్రలేమి సమస్య అధికంగా ఉన్నవారు వైద్యుడి సలహాతో మాత్రమే ఈ మెలటోనిన్ సప్లిపెంట్స్ వాడాలి. కానీ మన దేశంలో చాలా మంది నిద్రలేమి సమస్య లేకున్నా ఈ సప్లిమెంట్స్ వాడుతున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడికల్ షాపుల్లో ఈ మాత్రలు విచ్చలవిడిగా దొరుకుతుండటమే ఇందుకు కారణం.
నిద్ర మాత్రలను దుర్వినియోగం చేస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా నిద్రమాత్రలు వేసుకునేవారు వైద్యుడిని సంప్రదించి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాలని సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి పెరుగుదల, ఎక్కువసేపు కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ చూడటం నిద్రలేమికి దారితీస్తుందని, అందుకే ఈ సమస్యతో సతమతమవుతున్న చాలా మంది మెలటోనిన్ సప్లిమెంట్‌ను వాడుతున్నారని అధ్యయనం పేర్కొన్నది. నిద్రకు తప్పనిసరిగా నిర్ధిష్ట సమయాన్ని కేటాయించుకోవాలని, కెఫీన్ వాడకంతోపాటు స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.