Hamas-Israel War | జెరూసలేం, ఏప్రిల్ 7: అది 2023, అక్టోబర్ 7.. ఇజ్రాయెల్ భూభాగంపైకి గాజా స్ట్రిప్ నుంచి ఒక్కసారిగా వందలాది రాకెట్లు దూసుకొచ్చాయి. అకస్మాత్తు దాడితో హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లో విధ్వంసం సృష్టించారు. ఊహించని దాడి నుంచి తేరుకొన్న ఇజ్రాయెల్ వెంటనే ప్రతిదాడికి దిగింది. గాజా స్ట్రిప్‌పై మొదటగా రాకెట్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఆ తర్వాత హమాస్‌ను పూర్తిగా మట్టుపెట్టే లక్ష్యంతో ఏకంగా గాజా భూభాగంలోకి వెళ్లి దాడులను ముమ్మరం చేసింది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ఆదివారంతో ఆరు నెలలు గడిచాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా దాదాపు 35 వేల మంది మరణించగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. వేలాది భవనాలు, ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజావాసులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉండేందుకు ఇండ్లు లేక, తినేందుకు తిండి దొరక్క అవస్థలు పడుతున్నారు.
‘గాజాపై యుద్ధంలో విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. బందీలందరినీ హమాస్ వదిలిపెట్టే వరకు సంధి, కాల్పుల విరమణ ప్రసక్తే లేదు. డీల్ చేసుకొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది కానీ, సరెండర్ అయ్యేందుకు కాదు! మా దేశంపై పలు దాడుల వెనుక ఇరాన్ ఉన్నది. మమ్మల్ని దెబ్బతీసినా, ఆ దిశగా ప్లాన్లు వేసినా.. మేం కూడా అదే రీతిలో స్పందిస్తాం. అన్నివేళలా ఇదే విధానాన్ని పాటిస్తాం.’
-బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ ప్రధాని