Kamala Harris | అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కమలా హారిస్ (Kamala Harris) తమ ప్రచార జోరు పెంచారు. అయితే, ఈ ఎన్నికల వేళ అభ్యర్థులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు దాడి జరగ్గా.. తాజాగా కమలా హారిస్ (Kamala Harris)ను దుండగులు టార్గెట్ చేశారు. కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై తుపాకులతో దాడి (Shots fired) చేశారు.
అరిజోనా (Arizona)లోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై (poll campaign office) గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అరిజోనా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
ట్రంప్‌పై వరుస కాల్పుల ఘటనలు..
కాగా, ఇటీవలే డొనాల్డ్ ట్రంప్‌పై వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే వ్యక్తి సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవిని తాకుతూ తూటా దూసుకెళ్లింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం డయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఆ తర్వాత ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం (security threat) బయటపడింది.
గత నెల 30న పెన్సిల్వేనియా (Pennsylvania)లోని జాన్స్టౌన్ (Johnstown)లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్‌పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 15న కూడా ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు.
గెలుపెవరిదో..?
ఇక నవంబర్ 5న అమెరికా 47వ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలాదే పైచేయి అని అత్యధిక సర్వేలు అంచనా వేస్తున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలా హారిస్‌దే పైచేయి కొనసాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read..
Jr NTR | డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుదాం.. యువతకు ఎన్టీఆర్ పిలుపు
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
JK Elections | రెండు గంటల్లో 10 శాతం మేర పోలింగ్ నమోదు