హైదరాబాద్: ఉక్రెయిన్లో రష్యా దాడులను ఉధృతం చేసింది. రాజధాని కీవ్ సహా ఖార్కీవ్ వంటి పెద్ద పట్టణాలు బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాలు, భారీగా ఎగసిపడుతున్న పొగలతో భీతావహ దృష్యాలు కనిపిస్తున్నాయి. దేశంలో రెండో పెద్ద పట్టణమైన ఖార్కీవ్పై (Kharkiv) రష్యన్ వైమానిక దళం పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో 21 మంది మృతిచెందగా, వంద మందికిపైగా గాయపడ్డారు. నగరంలోని ఓ ప్రసూతి దవాఖానపై (Maternity home) వైమానిక దళం గుండ్ల వర్షం కురిపించడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు.
నికోలవ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇక ఖేర్సన్ పట్టణాన్ని రష్యా ఆక్రమించుకున్నది.
కాగా, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గత గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. చనిపోయినవారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు యూఎన్ చెప్పింది. కానీ ఉక్రెయిన్ వార్లో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని యూన్ మానవహక్కుల హై కమిషనర్ లిజ్ త్రోసెల్ తెలిపారు. భారీ ఆర్టిల్లరీ షెల్లింగ్, వైమానిక దాడులు, పేలుళ్లతో ప్రాణ నష్టం కలిగినట్లు యూఎన్ తెలిపింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు 400 మంది గాయపడినట్లు కూడా యూఎన్ చెప్పింది. కానీ ఉక్రెయిన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం. . ఆ దేశంలో ఇప్పటి వరకు 352 మంది పౌరులు మరణించారు. 1684 మంది గాయపడ్డారు.