Bangladesh Protests | పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి (Bangladesh Protests). కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పుల్లో గాయపడిన బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ (Osman Hadi) సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతితో బంగ్లాలో ఉద్రిక్తత తలెత్తింది. వేల సంఖ్యలో విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజ్‌షాహిలోని అవామీ లీగ్ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు (Awami League offices vandalised). బుల్డోజర్తో కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లోని డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయంపై కూడా దాడి చేశారు. ఢాకాలోని కవ్రాన్ బజార్లో ఉన్న కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో కార్యాలయంలో చిక్కుకుపోయిన దాదాపు 25 మంది జర్నలిస్ట్‌లను స్థానికులు కాపాడారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడులు చేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ (Sheikh Mujibur Rehman) కుటుంబానికి ధన్‌మోండీ 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు.
కాగా, హదీ విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జులైలో అవామీలీగ్ నేత, ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దీంతో హదీ మరణాన్ని ఉద్యమంపై జరిగిన దాడిగా భావిస్తున్నారు. హదీ మరణంపై ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. జులై ఉద్యమంలో ఒక నిర్భయ యోధుడని, ఆయన హత్య అత్యంత విచారకరమని అన్నారు. హంతకులను వదిలిపెట్టబోమని హెచ్చరంచారు. హదీ భార్య, ఆయన బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. శాంతిని, సంయమనాన్ని పాటించాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు.
Also Read..
YouTuber: యూట్యూబర్ ఇంట్లో ఈడీ తనిఖీలు.. లాంబోర్గినీ, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు సీజ్