న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో యూట్యూబ్ ఛానల్(Youtuber) నిర్వహిస్తున్న ఉన్నావ్ నివాసితుడు అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఆ సోదాల్లో అతని ఇంట్లో లగ్జరీ కార్లు ఉన్నట్లు గుర్తించారు. లాంబోర్గినీ ఉరుస్, బీఎండబ్ల్యూ జెడ్4, మెర్సిడీజ్ బెంజ్ లాంటి నాలుగు లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ల ద్వారా ఆ యూట్యూబర్ భారీ ఆర్జించినట్లు ఈడీ పేర్కొన్నది. ఆ యూట్యూబర్ గ్యారేజీలో ఉన్న కార్లను చూసి ఈడీ స్టన్ అయ్యింది. గ్యాంబ్లింగ్ నెట్వర్క్ ద్వారా అక్రమంగా అతను డబ్బులు సంపాదించినట్లు ఈడీ వెల్లడించింది. స్కై ఎక్స్చేంజ్, గ్యాంబ్లింగ్ యాప్ల ద్వారా ఆ యూట్యూబర్ భారీ స్థాయిలో డబ్బులు పోగు చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్యాంబ్లింగ్ యాప్లతో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించేవాడు ద్వివేది. ఆ యాప్ల ద్వారా వచ్చిన డబ్బును మనీల్యాండరింగ్ చేసేవాడని, ఆ తర్వాత ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవాడని తెలిసింది. పీఎంఎల్ఏ చట్టం కింద అతనిపై ఈడీ చర్యలు తీసుకున్నది.
యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ద్వివేది తన ఛానల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. దీంతో ఆ ఛానల్ ఫాలోఅవుతున్న అనేక మంది ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా అతను అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఈడీ చెప్పింది. ఈ నెట్వర్క్లో ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. అక్రమంగా ఎంత సంపాదించారు, ఎంత పెట్టుబడి పెట్టారన్న కోణంలో విచారణ సాగనున్నది. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఆస్తులను సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.