Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి కష్టాలు కొనసాగుతున్నాయి. నటికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ బాస్టియన్‌పై బెంగళూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు, అర్ధరాత్రి పార్టీలకు అనుమతించి నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. తాజాగా ముంబయిలోని శిల్పా శెట్టి రెస్టారెంట్‌పై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో శిల్పా శెట్టి హోటల్ సైతం ఉందని పేర్కొన్నారు. బుధవారం నుంచి ముంబయి, పరిసర ప్రాంతాల్లోని సుమారు 20 నుంచి 24 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సోదాలలో శిల్పా శెట్టికి చెందిన ఒక రెస్టారెంట్, మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. బాస్టియన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను అవకతవకలపై అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇన్ కం ట్యాక్స్ అధికారులు ముంబయిలోని ఇంటిపై దాడులు చేశారన్న వార్తను శిల్పా శెట్టి ఖండించింది. మహారాష్ట్ర పోలీసులు శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై మోసం ఆరోపణలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో గానీ, నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై బెంగళూరులో నమోదైన కేసుతో గానీ, ఐటీ సోదాలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని బాస్టియన్ రెస్టారెంట్‌కు శిల్పాశెట్టి కో ఓనర్‌గా ఉన్నట్లు సమాచారం. రెస్టారెంట్లో బాలీవుడ్ నటికి యాజమాన్య హక్కులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా రూ.60కోట్ల మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా శిల్పా క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తాను విచారణకు సహకరించినట్లుగా తెలిపారు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందన్న ఆమె.. తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. ఈ కేసులో తన పేరును ఇరికించారని.. కంపెనీలో తన పాత్ర, కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. గురువారం శిల్పా శెట్టి 2019లో బాస్టియన్ హాస్పిటాలిటీలో 50శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ వ్యాపారవేత్త రంజీత్ బింద్రా యాజమాన్యంలో కొనసాగుతున్నది. ముంబయి, గోవా, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో బాస్టియన్ పేరిట రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు. శిల్పా సోషల్ మీడియా వేదికగా ఈ విలాసవంతమైన రెస్టారెంట్ల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంటుంది. అయితే, ఓ వైపు పలు వివాదాల్లో చిక్కుకున్న శిల్పా.. త్వరలోనే ‘అమ్మకై’ పేరుతో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నది.