Sheikh Hasina : బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ కేసు నమోదైంది. హసీనా మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (CID) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ గురువారం సీఐడీకి సూచించింది.
‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’ పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19న కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్ధం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారం ఉందని సీఐడీ పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందని తెలిపింది. షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు వెల్లడించింది.
హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.