న్యూయార్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina).. తాత్కాలిక నేత మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మైనార్టీలను తీవ్ర ఊచకోస్తున్నట్లు ఆమె ఆరోపించారు. న్యూయార్క్‌లో ఆమె వర్చువల్ సందేశం ఇచ్చారు. యూనుస్ సర్కారు నరమేధానికి పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. మైనార్టీలతో పాటు హిందువులపై దాడులను అరికట్టడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. తనను, తన సోదరి షేక్ రెహానాను కూడా యూనుస్ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్లాన్ వేసిందన్నారు. తన తండ్రి షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌ను చంపిన మాదిరిగానే హత్యకు కుట్ర జరిగిందన్నారు. ముజ్బిర్ రెహ్మాన్‌ను 1975లో హత్య చేశారు.
ఆగస్టులో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. తొలుత ఇండియాలో తలదాచుకున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో ఆమె దేశం విడిచి పారిపోయారు. అయితే ఆ ఘటన తర్వాత తొలిసారి హసీనా బహిరంగంగా మాట్లాడారు. ఊచకోతకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని, కానీ నిజానికి యునుస్ నరమేధం సృష్టిస్తున్నారని, చాలా సూక్ష్మ పద్ధతిలో ఆ ప్రక్రియ జరుగుతోందని హసీనా ఆరోపించారు. విద్యార్థి సంఘాల కోఆర్డినేటర్లు, యునుస్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు.