Pakistan | ఇస్లామాబాద్, ఏప్రిల్ 26: పహల్గాం ఉగ్రదాడిపై తమపై భారత్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఆంక్షలను దీటుగా ఎదుర్కొంటామని, యుద్ధమంటూ వస్తే సత్తా చాటుతామని, ఒక పక్క పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేస్తుండగా, మరోపక్క సాక్షాత్తు ఆ దేశ పౌరులే ‘లేవలేని శూరా.. పొల్లు మాటలాపరా’ అంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తూ జోక్‌లు వేస్తున్నారు. భారత దేశం ముందు పాక్ ఏమాత్రం నిలబడుతుంది అంటూ వారు ట్రోల్స్, మీమ్స్ విసురుతున్నారు. పలు విషయాలలో ఆ దేశ దుర్భరత్వంపై వారు ప్రభుత్వాన్ని నిలదీయడమే కాక, పహల్గాం దాడికి జవాబుదారీతనం కోరుతున్నారు. ప్రభుత్వ చర్యలతో విసుగెత్తిపోయిన పలువురు మీమ్స్, సెటైర్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
గ్యాస్ ఆగి పోతుంది..
‘భారత్ కనుక పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలనుకుంటే దానిని రాత్రి తొమ్మిది గంటల ముందే ముగించాలి. కారణమేంటంటే తొమ్మిది దాటితే గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది’ అని ఒక పాక్ నెటిజన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ ఒక ప్రసిద్ధ మీమ్‌ను షేర్ చేశాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ పహల్గామ్ దాడిపై చర్య తీసుకోవాలని కోరిన ఒక భారతీయుని పోస్టుకు బదులుగా ఒక ఫైటర్ జెట్ లాంటి నిర్మాణం కలిగిన ఒక మోటార్ సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను షేర్ చేశాడు.
ఆ మోటార్ సైకిల్‌ను కార్డు బోర్డుతో తయారు చేశారు. ప్రస్తుతం పాకిస్థానీలు జీవిస్తున్న దుర్భర పరిస్థితిని ఉద్దేశించి కొందరి సంభాషణను ప్రస్తావించాడు. ‘భారత దేశం పాకిస్థాన్‌పై బాంబు దాడి చేయబోతుందా?’ అని ఒక వినియోగదారుడు అడగడంతో సంభాషణ ప్రారంభం అవుతుంది. దీనికి ఒకరు ‘భారతీయులు తెలివితక్కువ వారు కాదు’ అని సమాధానం చెబుతారు. ఈ దుఃఖం బాంబు దాడి కన్నా కష్టమేమీ కాదు.. ఇది ఎప్పుడు ముగుస్తుంది బ్రో అని మూడో వ్యక్తి ప్రశ్నిస్తాడు.
పాకిస్థాన్‌కు నీటి ఇబ్బందులు కలిగించడానికి సింధూ జలాలను నిలిపివేస్తామంటూ భారత్ చేసిన ప్రకటనపై ఒక పౌరుడు స్పందిస్తూ పాకిస్థాన్ ఇప్పటికే నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నదని తెలిపాడు. నీరు ఆపుతారా? మాకు ఇప్పటికే తీవ్ర కొరత ఉంది.. మమ్మల్ని చంపుతారా? మా పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని హతమార్చింది.. లాహోర్‌ను ఆక్రమిస్తారా? అరగంటలోనే దానిని వెనక్కి ఇవ్వడం ఖాయం. అని కొందరు పాకిస్థాన్ నెటిజన్లు తమ దేశంలోని వాస్తవ పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.