ఢాకా, డిసెంబర్ 26: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే క్రమంలో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత ఇటీవల ఢాకాలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా శుక్రవారం నాడు ప్రార్థనల అనంతరం పలువురు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఢాకా యూనివర్సిటీలో ప్రదర్శన నిర్వహించారు. ఇటీవల హత్యకు గురైన యువ నేత ఉస్మాన్ హాదీ మద్దతుదారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ‘నేను హాదీని’ అని నినాదాలు చేస్తూ, త్వరగా విచారణ జరిపి ఉస్మాన్ హంతకులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
కాగా, హాదీ హంతకులు చట్టం నుంచి తప్పించుకోవడానికి బంగ్లాదేశ్ సరిహద్దు దాటారని ఒక వర్గం నిరసనకారులు ఆరోపిస్తున్నారు. హంతకులను అరెస్ట్ చేయడానికి ఢాకా.. భారతదేశం సహాయం కోరింది. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో న్యూఢిల్లీ ఆ ఆరోపణలను తీవ్రంగా తిరస్కరించిందని వారు పేర్కొన్నారు.