టెల్ అవివ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇజ్రాయిల్ చేరుకున్నారు. ఆయన జెరుసలాంలో ఉన్న ఇజ్రాయిలీ పార్లమెంట్ నీసెట్కు వెళ్తున్నారు. పార్లమెంట్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ ఆయనకు స్వాగతం పలికారు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత మంది బంధీలను హమాస్ రిలీజ్ చేసింది. అయితే ఆ బంధీల కుటుంబాలను ట్రంప్ కలుసుకోనున్నారు. దీని కోసం ఆయన గాజా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. షర్మ్ ఎల్ షేక్‌లో జరగనున్న గాజా పీస్ సదస్సులో ట్రంప్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో సుమారు 20 మంది ప్రపంచ నేతలు పాల్గొనున్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఆ సమావేశాలకు హాజరవుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఏడు మంది ఇజ్రాయిలీ బంధీలను గాజాలో రిలీజ్ చేశారు. వాళ్లంతా ఇజ్రాయిల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. బంధీలు రిలీజైన విషయాన్ని ఐడీఎఫ్ కన్ఫర్మ్ చేసింది. ఇవాళ మొత్తం 20 మంది బంధీలను రిలీజ్ చేయాల్సి ఉంది. దక్షిణ గాజాలో ఆ బంధీలను స్వీకరించేందుకు రెడ్ క్రాస్ సిద్ధంగా ఉంది. 2023, అక్టోబర్ 7వ తేదీన దక్షిణ ఇజ్రాయిల్ నుంచి ఆ బంధీలను పట్టుకెళ్లారు. అప్పగింతలో భాగంగా ఇజ్రాయిల్ సుమారు 250 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయనున్నది. మరో 1700 మందిని కూడా రిలీజ్ చేయనున్నారు.
గాజాలో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలసిందే. అయితే ఇజ్రాయిల్, హమాస్ డీల్‌కు చెందిన కీలక అంశాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. టెల్ అవివ్ చేరుకున్న తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాకు వెళ్లకున్నా అక్కడి పరిస్థితులు తనకు బాగా తెలుసు అని, అయితే గాజాకు వెళ్తానని, కనీసం అక్కడ నా కాలు మోపాలనుకుంటున్నట్లు చెప్పారు. మరీ వేగంగా వెళ్లాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో సరైన వేగంతో వెళ్లాలని, అప్పుడే సమస్యలు తీరుతాయన్నారు.