Mike Pence | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఇటీవలే రహస్య ఫైల్స్ వెలుగుచూశాయి. ఇప్పుడు మైక్ పెన్స్ వంతు వచ్చింది. ఆయన నివాసంలో కూడా సీక్రెట్ ఫైల్స్‌ను ఫెడలర్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రహస్య డాక్యుమెంట్లు ఆయన డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడి ఉన్న సమయంలోనివిగా అధికారులు గుర్తించారు. తన ఇంట్లో రహస్య డాక్యుమెంట్లు దొరికిన విషయాన్ని దాచి ఉంచాలని ఆయన ఎఫ్బీఐతో వేడుకుంటున్న సమయంలోనే మీడియాలో లీక్ కావడంతో పెన్స్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు చెందిన ఇండియానా ఇంటి నుంచి రహస్యపత్రాలను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకున్నది. గత నెలలో పెన్స్ సహాయకులు అతడి ఇంటి నుంచి 6 డాక్యుమెంట్స్ కనుగొన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ ఆమోదించింది. దాంతో పరిశోధకులకు సహకరించాలని, దర్యాప్తులో పారదర్శకంగా ఉండాలని పెన్స్ తన న్యాయ బృందానికి సూచించారు. కాగా, తన నివాసంలో రహస్య పత్రాలు దొరికిన విషయాన్ని దాచాలని ఆయన ఎఫ్‌బీఐ అధికారులకు విన్నవించుకున్నారు. అయితే, అప్పటికే డాక్యుమెంట్స్ దొరికిన విషయం కాస్తా మీడియాలో ప్రత్యక్షమవడంతో పెన్స్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దాంతో తనను తాను కాపాడుకునేందుకు ఈ నెపాన్ని న్యాయశాఖపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రెసిడెంట్ జో బైడెన్ విల్మింగ్టన్ ఇంటితోపాటు వాషింగ్టన్‌లోని ఓ భవనం నుంచి రహస్య పత్రాలను ఎఫ్‌బీఐ ఇటీవల స్వాధీనం చేసుకున్నది. దీంతో మైక్ పెన్స్ సహాయకులు జాగ్రత్తలు తీసుకుంటూ ఇండియానాలోని ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. ఇక్కడ క్లాసిఫైడ్ మార్క్‌తో కూడిన పత్రం లభించింది. ఈ విషయాన్ని పెన్స్ న్యాయ శాఖకు సమాచారమిచ్చారు. దీని తర్వాత మార్చ్ ఫర్ లైఫ్ కోసం పెన్స్ వాషింగ్టన్లో ఉన్న సమయంలో తనిఖీలకు ఎఫ్‌బీఐ అతడి ఇంటికి చేరుకున్నది. కాగా, అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడికి సంబంధించి మైక్ పెన్స్‌కు రెండు రోజుల క్రితమే సమన్లు అందినట్లుగా తెలుస్తున్నది. ఆ తర్వాత ఇప్పుడు సీక్రెట్ డాక్యుమెంట్స్ సెర్చ్ చేసేందుకు అతడి ఇంటికి ఎఫ్‌బీఐ చేరుకోవడం కలకలం రేపుతున్నది.