IND vs PAK : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్‌కు నీటి సరఫరాను ఆపేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోది. అయితే పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలకు దిగుతోంది. దాంతో భారత్ ఆ దేశంపట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్ స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దాంతో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు అక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు తెలిపారు. అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్థాన్‌కు తెలియజేసేందుకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపేసినట్లు చెప్పారు.
900 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యామ్‌ను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యామ్ పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. కాగా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది.