న్యూయార్క్: ఈ సృష్టిలో జన్మించిన ప్రతీ జీవికి మరణం తప్పదనేది అందరూ అనే మాట. అయితే, టర్రిటోప్సిస్ డోర్నీ అనే ఒక రకమైన జెల్లీషిష్ మాత్రం ఇందుకు మినహాయింపు. వయసును రివర్స్ చేసుకొనే అసాధారణ సామర్థ్యం ఈ సముద్ర జీవికి ఉంది. 1883లో ఈ జెల్లీఫిష్ను మొదట శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ టర్రిటోప్సిస్ డోర్నీ జీవనచక్రం మిగతా జెల్లీషిఫ్ల మాదిరిగానే ఉంటుంది.
లార్వా దశతో మొదలై పాలిప్ దశ(యువ)లోకి, ఆ తర్వాత అడల్ట్ దశలోకి మారుతుంది. అయితే, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, పర్యావరణ ఒత్తిడి కలిగినప్పుడు ఈ జీవి తన జీవనచక్రంలో వెనక్కు వెళ్లగలదు. దీని కణాలను పాలిప్ దశలోకి మార్చుకొని, మళ్లీ అక్కడి నుంచి జీవనచక్రాన్ని ప్రారంభించగలదు.
తద్వారా ఇది మళ్లీ యవ్వనంలోకి వెళ్లడంతో పాటు వృద్ధాప్యంతో సంభవించే మరణాన్ని దూరం చేసుకోగలదు. సాధారణంగా 4-5 మిల్లీమీటర్ల వ్యాసంలోనే ఉండే ఈ రకమైన జెల్లీషిఫ్లను మధ్యధరా సముద్రంలో మొదట గుర్తించగా, ఇప్పుడు అన్ని సముద్రాల్లో కనిపిస్తున్నాయి.