Cancer | న్యూయార్క్: క్యాన్సర్ మహమ్మారికి అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం ద్వారా సమర్థంగా క్యాన్సర్ కణతులను నాశనం చేయొచ్చని వీరు గుర్తించారు. ఈ చికిత్స ద్వారా సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించడంతో పాటు బాధితుల జీవితకాలాన్ని పెంచవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.
క్యాన్సర్‌కు ఇటీవల కొత్తగా ఫొటోథెరపీ అనే చికిత్స విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఈ చికిత్సలో భాగంగా బంగారు నానోపార్టికల్స్‌ను శరీరంలోని క్యాన్సర్ కణతుల వద్దకు పంపించి, బయటి నుంచి లేజర్ ద్వారా వాటిని వేడి చేస్తారు. ఇవి సమీపంలోని క్యాన్సర్ కణాలను అంతం చేస్తాయి.
క్యాన్సర్ చికిత్సకు ఎక్కువగా వినియోగిస్తున్న కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఏకకాలంలో చేయడమే ఎంఐటీ శాస్త్రవేత్తలు చెప్తున్న కొత్త చికిత్స విధానం. ఇందుకోసం వీరు మాలిబ్డినం సల్ఫైడ్ అనే నిరింద్రియ పదార్థంతో పాటు కీమోథెరపీకి వినియోగించే ఔషధాన్ని కలిపి సూక్ష్మ కణాలను తయారుచేసి వినియోగించారు. ఇవి లేజర్ లైట్‌ను 50 డిగ్రీల సెల్సియస్ వేడిగా మార్చడంలో సమర్థంగా పని చేస్తాయని, క్యాన్సర్ కణాలను అంతం చేయడానికి ఈ వేడి సరిపోతుందని పరిశోధకులు తెలిపారు. ఈ సూక్ష్మకణాలు వేడికి కరిగిపోయి వాటిల్లోని కీమోథెరపీ ఔషధాన్ని విడుదల చేస్తాయని చెప్పారు.