టోక్యో: పర్యావరణ హితకరమైన ప్లాస్టిక్ తయారీలో జపాన్ శాస్త్రవేత్తలు విప్లవం సృష్టించారు. సముద్రపు నీటిలో కలిసి, కొద్ది గంటల్లోనే ఈ ప్లాస్టిక్ కరిగిపోతుంది. దీనిని ఆర్ఐకేఈఎన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ప్లాస్టిక్‌ను ప్యాకేజింగ్ నుంచి మెడికల్ డివైసెస్ వరకు అన్ని రకాల వస్తువుల తయారీకి ఉపయోగించవచ్చు.
వేర్వేరు పరిశ్రమల్లో వాడటానికి సురక్షితమైన, విషరహిత పదార్థాలతో దీనిని తయారు చేశారు. సాధారణ ప్లాస్టిక్స్ ఈ విధంగా కరగాలంటే వందల సంవత్సరాలు పడుతుంది. జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కొద్ది గంటల్లోనే కరిగిపోతుంది. భూమిలో కలిస్తే 10 రోజుల్లో క్షీణిస్తుంది.