ETH | జురిచ్, డిసెంబర్ 13: శరీరంలోని అవసరమైన అవయవానికే నేరుగా ఔషధాన్ని అందించే సూక్ష్మ కణాలను స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ విద్యాసంస్థకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్డ్ మెటీరియల్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా టాబ్లెట్, ఇంజక్షన్ ద్వారా ఇచ్చే ఔషధం నేరుగా అవసరమైన అవయవానికి వెళ్లకుండా శరీరమంతా ప్రయాణిస్తుంది. ఈ సూక్ష్మ కణాల ద్వారా ఇచ్చే ఔషధం మాత్రం నేరుగా అవసరమైన అవయవానికి అందుతుంది. జింక్ ఆక్సైడ్తో శాస్త్రవేత్తలు ఈ మైక్రోపార్టికల్స్ను తయారుచేశారు.
ఔషధంతో కూడిన ఈ సూక్ష్మ కణాలను ఇంజక్షన్ ద్వారా రక్తంలోకి పంపించి, అల్ట్రాసౌండ్ విధానం ద్వారా బయటినుంచి అవసరమైన శరీర భాగానికి పంపించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అధిక డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని తెలిపారు. క్యాన్సర్, గుండెజబ్బులు ఉన్న రోగులకు ఈ కొత్త సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. గుండ్రంగా ఉండే సాధారణ సూక్ష్మ కణాల కంటే పూలలా కనిపించే ఈ సూక్ష్మ కణాలతో ఎక్కువ మోతాదులో ఔషధాన్ని శరీరానికి అందించవచ్చని చెప్పారు. ఎలుకలపై చేసిన పరీక్షలు విజయవంతమైనట్టు తెలిపారు.