Breast Cancer | న్యూయార్క్, జనవరి 23: రొమ్ము క్యాన్సర్ చికిత్స కాలాన్ని గణనీయంగా తగ్గించే కొత్త కృత్రిమ అణువును అమెరికన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తయారు చేసిన ఈఆర్ఎస్ఓ-టీఎఫ్పీవై అనే కృత్రిమ అణువుకు సంబంధించిన వివరాలు అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రచురించే ఏసీఎస్ సెంట్రల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈస్ట్రోజెన్ రెసెప్టార్ పాజిటివ్(ఈఆర్ పాజిటీవ్) బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల చికిత్సకు ఈ కృత్రిమ అణువును వినియోగించవచ్చని, ఒకే డోస్‌తో ఇది చిన్న క్యాన్సర్ కణతులను అంతమొందిస్తుందని, పెద్ద కణుతులను తగ్గిస్తుందని పరిశోధకుడు పాల్ హెర్జెన్రోథర్ తెలిపారు. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఈఆర్ పాజిటివ్ క్యాన్సర్ ఉంటుందని అంచనా. వీరికి శస్త్రచికిత్స చేసిన తర్వాత దాదాపు 5 -10 ఏండ్ల పాటు హార్మోన్ థెరపీ అందించాలి.
ఇలా ఎక్కువకాలం హార్మోన్ థెరపీ చేయడం వల్ల రక్తం గడ్డకట్టడం, కండరాల నొప్పి, లైంగిక సమస్యలు, అలసట వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటి వల్ల 20-30 శాతం మంది రోగులు మధ్యలోనే చికిత్సను వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ కణాలను అంతం చేసేందుకు 2021లో పాల్ హెర్జెన్రోథర్ బృందం ఈఆర్ఎస్ఓ అనే కృత్రిమ అణువును తయారు చేసింది.
అయితే,దీనితోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండటంతో పలు మార్పులు చేసి ఈఆర్ఎస్ఓ-టీఎఫ్పీవైను తయారుచేశారు. ఎలుకలకు ఒకే డోస్ ఇవ్వగా చిన్న కణతులు అంతమయ్యాయి. పెద్ద కణతులు కూడా క్షీణించాయి. మనుషులపై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.