Soledar city | ఉక్రెయిన్ దేశానికి చెందిన సోలెడార్ నగరాన్ని రష్యా ఆక్రమించుకున్నది. ఉక్రెయిన్ సైనికులను చంపిన తర్వాత నగరాన్ని హస్తగతం చేసుకున్నామని రష్యాకు చెందిన ప్రైవేట్ మిలిటరీ వాగ్నర్ గ్రూపు పేర్కొన్నది. ఈ గ్రూపును పుతిన్ చెఫ్‌గా ఉన్న మెవ్జెనీ ప్రిగోగిన్ నిర్వహిస్తున్నారు. సోలెడార్లోని ఉప్పు గని వద్ద సైనికులతో దిగిన ఫొటోను మెవ్జెనీ తన గ్రూపులో షేర్ చేశారు. దాదపు 500 మంది ఉక్రెయిన్ సైనికులను హతమార్చామని కూడా ఆయన తెలిపారు. ఈ సోలెడార్ ఉక్రెయిన్ పశ్చిమ భాగాన ఉన్న ఓ చిన్న పట్టణం.
అయితే, రష్యా ప్రకటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. వాగ్నర్ వాదనను ఉక్రెయిన్ సవాలు చేసింది. యుద్ధం ఇంకా ముగియలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ దేశ సైనికులు శత్రువులను సమర్ధంగా ఎదుర్కొంటున్నారని, సోలెడార్ ఆక్రమణకు వచ్చిన దాదాపు 100 మంది రష్యా సైనికులను చంపినట్లు పేర్కొన్నారు. సోలెడార్ పట్టణంపై ఇటు రష్యా, అటు ఉక్రెయిన్ పట్టు అందుకుంటున్నాయి. ఈ ప్రాంతం రెండు దేశాల ఆక్రమణలో ఉన్నట్లుగా అనిపిస్తుందని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఈయన ప్రకారం సోలెడార్‌లో చాలా ప్రమాదకరమైన రీతిలో యుద్ధం జరుగుతున్నది.
ఇలాఉండగా, ఉక్రెయిన్‌తో యుద్ధంలో గెలిచిన నగరాలను రష్యా మెల్లమెల్లగా కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఉక్రెయిన్‌లోని ఏదైనా కొత్త భాగాన్ని గెలుచుకున్నట్లు ప్రకటించడానికి తొందరపడవద్దని రష్యా తన అధికారులకు ఇప్పటికే సూచనలు చేసింది. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన మెవ్జెనీ సోలెడార్ పట్టణాన్ని ఆక్రమించుకున్నట్లు ప్రకటించడం విశేషం. సోలెడార్ పూర్తిగా నాశనమైందని, సోలెడార్ ప్రాంతం మొత్తం శవాలతో నిండిపోయి ఉన్నదని సోమవారం ఒక ప్రసంగంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.